Reading Time: 2 minutes

అక్షరాలు రాని చోట అమ్మ చేతే భాష అయింది: హృదయాలను హత్తుకునే రియల్ లైఫ్ స్టోరీ!

Caption of Image.

పిల్లల కోసం ఒక తల్లి ఎంత దూరమైనా వెళుతుంది అనడానికి కెనడాకు చెందిన ఈ తల్లే ఒక గొప్ప ఉదాహరణ. తన కొడుకుకు మాటలు రాకపోయినా, అతనికి ఎప్పటికీ ఆ లోటు తెలియకూడదని ఆమె చేసిన ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను హత్తుకుంటోంది.

బ్యాటరీ అయిపోయిన క్షణం.. పుట్టిన అద్భుతమైన ఆలోచన
జెస్సికా ఫ్లెచర్ అనే మహిళకు 11 ఏళ్ల కొడుకు ఉన్నాడు, అతని పేరు హంటర్. హంటర్‌కు ఆటిజం ఉంది, పైగా మాటలు రావు. తనకేం కావాలో ఇతరులకు చెప్పడానికి  ఎప్పుడూ ఒక ట్యాబ్ (AAC డివైజ్) వాడేవాడు. ఒకరోజు తల్లీకొడుకులు సరదాగా బయట భోజనానికి వెళ్లారు. సరిగ్గా అప్పుడే ఆ ట్యాబ్  బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది.

మిషన్ ఆగిపోతే వాడి గొంతు ఆగిపోయినట్టే కదా అని తల్లి కంగారు పడింది. కానీ, హంటర్ చాలా తెలివిగా అక్కడున్న ఒక టిష్యూ పేపర్ తీసుకుని దాని మీద ‘కీబోర్డ్’ బొమ్మ గీశాడు. అందులో అక్షరాలను తన వేలితో చూపిస్తూ తనకు ఏం కావాలో తల్లికి అర్థమయ్యేలా చెప్పాడు. ఆ క్షణం ఆ తల్లి మనసు చలించిపోయింది. టెక్నాలజీ ఎప్పుడైనా ఆగిపోవచ్చు, అలాంటప్పుడు నా కొడుకు గొంతు మూగబోకూడదు అని ఆమె అనుకుంది.

చేతిపైనే కీబోర్డ్ పచ్చబొట్టు
వెంటనే ఒక టాటూ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లి, తన చేతి పై  కీబోర్డ్‌నే ఏకంగా పచ్చబొట్టుగా వేయించుకుంది. ఆ టాటూలో ఇంగ్లీష్ అక్షరాలతో పాటు స్మైలీ ఫేస్, శాడ్ ఫేస్, లవ్ సింబల్ లాంటివి కూడా ఉన్నాయి. ఈ టాటూ వేయించుకున్న తర్వాత హంటర్ అందులో అక్షరాలను తాకుతూ చెప్పిన మొదటి పదం ఏంటో తెలుసా? “అమ్మా”. ఆ ఒక్క మాటతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

దీనివల్ల లాభం ఏంటంటే 
మామూలుగా పబ్లిక్ ప్లేసుల్లో ఆ మిషన్ వాడినప్పుడు, అందులోంచి వచ్చే సౌండ్ కి చుట్టుపక్కల వాళ్ళంతా వింతగా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు హంటర్ ఎవరికీ తెలియకుండా, సైలెంట్ గా తన తల్లి చేతిమీద ఉన్న అక్షరాలను తాకుతూ తనకేం కావాలో చెప్పేస్తున్నాడు. దింతో వాళ్ళిద్దరి ప్రపంచం చాలా ప్రైవేట్ గా, అందంగా మారిపోయింది.

వైరల్ అయిన వీడియో.. 
హంటర్ ఈ టాటూను వాడుతున్న వీడియోను జెస్సికా సోషల్ మీడియాలో పెడితే, దానికి ఏకంగా 20 లక్షల లైక్స్ వచ్చాయి. ఇది చూసిన హంటర్ స్కూల్ ఫ్రెండ్స్.. “ఆంటీ, మాకు కూడా ఇలాంటి కీబోర్డ్ ఉన్న టీ-షర్ట్స్ కావాలి. అప్పుడే మేం ఆడుకునేటప్పుడు హంటర్ తో సైలెంట్ గా మాట్లాడుకోగలం” అని అడిగారు. పిల్లల ప్రేమ చూసి ఒక బట్టల కంపెనీ వాళ్ళు అలాంటి కీబోర్డ్ షర్ట్స్ తయారు చేయడానికి ముందుకొచ్చారు. చాలా మంది టాటూ ఆర్టిస్టులు సైతం, ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఇలాంటి టాటూలు ఫ్రీగా వేస్తామని ముందుకొస్తున్నారు.

అమ్మ ప్రేమంటే ఇదే..
“నా కొడుకుకి మాటలు అందించడం కోసం నా చేతికి ఎన్ని గాయాలైనా భరిస్తాను. వాళ్ళ మనసులోని మాటలు చెప్పే అవకాశం ఇస్తే, వాళ్ళు నిజంగా ఎంత గొప్పవాళ్లో మనకు అర్థమవుతుంది” అంటుంది జెస్సికా ఫ్లెచర్… నిజమే కదా.. టెక్నాలజీ ఆగిపోవచ్చేమో కానీ, అమ్మ ప్రేమ ఎప్పటికీ ఆగిపోదు!

 

©️ VIL Media Pvt Ltd.