Reading Time: 2 minutes
2027 World Cup: కావాలనే తొక్కేస్తున్నారా? కనీసం బ్యాకప్‌కి కూడా పనికిరాడా?

2027 వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో మిడిల్ ఆర్డర్‌లో బ్యాకప్‌ ఆటగాడిగా యువ బ్యాటర్ తిలక్ వర్మను పరిగణిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఎడమచేతి వాటం బ్యాటర్‌ కోసం జట్టు యాజమాన్యం చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తిలక్ వర్మ పేరు తెరపైకి వచ్చింది. తిలక్‌ ఎడమచేతి వాటం బ్యాటర్ కావడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో వైవిధ్యం తీసుకురాగలడని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో అతని ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌ను కూడా మెరుగుపరుచుకోవాలని జట్టు యాజమాన్యం సూచించినట్లు తెలుస్తోంది.

అయ్యర్‌కు ప్రత్యామ్నాయంగా తిలక్

సమాచారం ప్రకారం టాప్ సిక్స్‌లో శ్రేయస్ అయ్యర్‌కు ప్రత్యామ్నాయంగా తిలక్ వర్మను సిద్ధం చేసే ఆలోచన జరుగుతోంది. హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి వంటి ఆల్‌రౌండర్లు తరచూ గాయాల సమస్యలు ఎదుర్కొంటుండటంతో, కనీసం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగల బ్యాటర్ జట్టులో ఉండటం అవసరమని గంభీర్, గిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిడిల్ ఆర్డర్‌కు సరైన బ్యాకప్ లేకపోవడం ప్రస్తుతం భారత జట్టుకు ఆందోళనగా మారిందని BCCI వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం.

మరి రుతురాజ్ గైక్వాడ్ పరిస్థితి ఏంటి?

ఇదే అంశం ఇప్పుడు అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గతంలో నాలుగో స్థానంలో ఆడిన రుతురాజ్ గైక్వాడ్, దక్షిణాఫ్రికాపై రాయ్‌పూర్‌లో సెంచరీ చేసి తన సత్తా చాటాడు. అయినప్పటికీ ఆ ఇన్నింగ్స్ తర్వాత అతడికి వన్డే జట్టులో మళ్లీ స్థానం దక్కలేదు. గైక్వాడ్‌ను నాలుగో స్థానంలో ఆడించి ఫలితం పొందినప్పుడు.. ఇప్పుడు అదే స్థానానికి బ్యాకప్‌గా తిలక్ వర్మను ఎందుకు పరిగణిస్తున్నారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అవసరమైన సమయంలో పరుగులు చేసిన ఆటగాడిని పక్కన పెట్టడం సరైన నిర్ణయమేనా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

యువ బ్యాకప్‌లపై భారత్ దృష్టి

2027 ప్రపంచకప్‌ దక్షిణాఫ్రికాలో జరగనున్న నేపథ్యంలో అక్కడి పేస్, బౌన్స్‌కు అనుగుణంగా యువ ఆటగాళ్లను సిద్ధం చేయాలని భారత జట్టు భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు కేఎల్ రాహుల్‌ కూడా అప్పటికి 35 ఏళ్లు దాటే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా భవిష్యత్తు కూడా అప్పటికి స్పష్టంగా ఉండకపోవచ్చు. అందుకే ఫిట్‌నెస్, ఫీల్డింగ్, బ్యాకప్ బెంచ్ బలంపై జట్టు యాజమాన్యం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్‌కు గతంలో గాయం కావడం కూడా ప్రత్యామ్నాయ ఆటగాడి అవసరాన్ని స్పష్టం చేసింది.

అభిమానుల ఆగ్రహం

రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టడంపై అభిమానుల నుంచి తీవ్ర స్పందన వస్తోంది. అవకాశం లభించినప్పుడు సెంచరీ చేసిన ఆటగాడిని మళ్లీ ఎందుకు పరిశీలించడం లేదని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయ్యర్‌కు బ్యాకప్‌గా గైక్వాడ్‌ను ఉపయోగించవచ్చని, అతడిని పూర్తిగా పక్కన పెట్టడం తొందరపాటు నిర్ణయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉండటంతో సెలెక్టర్లు ప్రస్తుతం ఆటగాళ్ల బహుముఖ సామర్థ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తిలక్ వర్మకు బ్యాకప్‌ పాత్ర ఇవ్వాలనే ఆలోచన తుది నిర్ణయం కాకపోవచ్చు. రాబోయే సిరీస్‌లలో ఆటగాళ్ల ప్రదర్శన, ఫిట్‌నెస్ ఆధారంగా భారత ప్రపంచకప్ ప్రణాళికలు మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి