Reading Time: < 1 minute
1 నుంచి 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో కీలక మార్పులు.. ఇక క్రాస్ వల్యుయేషన్!

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 30: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల మూల్యాంకనంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతో పాటు విద్యార్థుల ప్రతిభను నిష్పక్షపాతంగా అంచనా వేయడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి విద్యార్థుల SA-1, SA-2 పరీక్షల జవాబు పత్రాలతో పాటు 10వ తరగతి SA-1 పరీక్షల జవాబు పత్రాలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయరు. వాటి స్థానంలో ఇతర పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించనున్నారు. ఈ విధానాన్ని క్రాస్ వాల్యుయేషన్‌గా పిలుస్తారు. దీనివల్ల విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలో పక్షపాతం లేకుండా మరింత పారదర్శకత తీసుకురావచ్చని విద్యాశాఖ భావిస్తోంది.

మండల కేంద్రాల్లో ప్రత్యేక వాల్యుయేషన్ సెంటర్లు

క్రాస్ వాల్యుయేషన్‌ను సమర్థంగా నిర్వహించేందుకు ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక వాల్యుయేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ కేంద్రాలు మండల విద్యాశాఖాధికారుల (MEO) పర్యవేక్షణలో పనిచేయనున్నాయి. ఇతర పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను ఈ కేంద్రాలకు కేటాయించి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను నిర్వహించనున్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను సరిగ్గా గుర్తించేందుకు పరీక్షల ఫలితాలు కీలకం. అయితే అదే పాఠశాల ఉపాధ్యాయులు తమ విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం వల్ల కొన్నిసార్లు మార్కుల విషయంలో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించడం ద్వారా విద్యార్థుల అసలైన విద్యా సామర్థ్యాలను మరింత నిష్పక్షపాతంగా అంచనా వేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యం

కొత్త విధానం ద్వారా పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం కూడా పెరుగుతుందని విద్యాశాఖ పేర్కొంది. అలాగే విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించి అవసరమైన చోట అదనపు బోధన, రెమెడియల్ కార్యక్రమాలను చేపట్టేందుకు ఈ మూల్యాంకన ఫలితాలు ఉపయోగపడనున్నాయి. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు పరీక్షల మూల్యాంకనాన్ని మరింత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మార్చే దిశగా ఈ క్రాస్ వాల్యుయేషన్ విధానం కీలక అడుగుగా నిలవనుంది.