Reading Time: 2 minutes

ఒక క్రైమ్ థ్రిల్లర్.. ఒక ఇంట్రోవర్ట్ లవ్ స్టోరీ.. అబ్సెషన్ తరహా కథతో మరో సినిమా.. ఏది బాగుందంటే..

Caption of Image.

అస్థిపంజరం వెనుక మిస్టరీ..

  • టైటిల్ : వదంతి: 2 ది మిస్టరీ ఆఫ్ మణి
  • డైరెక్షన్: ఆండ్రూ లూయిస్
  • కాస్ట్: ఎం. శశికుమార్, వివేక్ ప్రసన్న, అనఘా మరుదోరా, యశ్వంత్, అపర్ణ దాస్
  • ప్లాట్‌ఫాం: అమెజాన్ ప్రైమ్ వీడియో

మధురైలో హైవే నిర్మాణం సందర్భంగా బయటపడిన అస్థిపంజరం ఓ సంచలన హత్య కేసుకు దారితీస్తుంది. దర్యాప్తు చేపట్టిన ఎస్‌ఐ మూసా రాజా (శశికుమార్).. ఈ కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న మణి అనే ఖైదీని కలుసుకుంటాడు. అయితే మణి ప్రవర్తన, కేసులోని కొన్ని ఆధారాలు అతడే హంతకుడా అనే అనుమానాన్ని కలిగిస్తాయి.

నిజానిజాలు తెలుసుకునేందుకు మూసా రాజా లోతుగా దర్యాప్తు మొదలుపెట్టడంతో రాజకీయ ఒత్తిళ్లు, మీడియా కథనాలు, దాగిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. మణి చుట్టూ దాగి ఉన్న అసలు నిజమేంటి? అస్థిపంజరం వెనుక మిస్టరీ ఏంటి? నిజాన్ని వెలికితీసే క్రమంలో మూసా రాజా ఎదుర్కొన్న సవాళ్లే ఈ క్రైమ్ థ్రిల్లర్ కథ.

హృదయ ప్రేమకథ

  • టైటిల్ : హృదయం మురళి
  • డైరెక్షన్: ఆకాష్ భాస్కరన్
  • కాస్ట్: అధర్వ, ప్రీతి ముకుందన్, కయాదు లోహర్, నట్టి, ఫహాద్ ఫాజిల్, తమన్, నిహారిక ప్లాట్‌ఫాం: థియేట్రికల్ రిలీజ్

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన హృదయ (అధర్వ) మేనమామ సంరక్షణలో పెరుగుతాడు. ఆ లోటు కారణంగా తన భావాలను బయటపెట్టడానికి ఎప్పుడూ వెనుకాడుతుంటాడు. కాలేజీ రోజుల్లో సమంత (ప్రీతి ముకుందన్)ను ప్రేమించినా చెప్పుకోలేడు. ఆ తర్వాత చెన్నైలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో డాక్టర్ అముద (కయాదు లోహర్) పరిచయం కావడంతో ఆమెను కూడా మనసారా ఇష్టపడతాడు. కానీ ఈసారి కూడా తన ప్రేమను వ్యక్తం చేయలేకపోతాడు.

అలా తాను ప్రేమించిన అమ్మాయిలను కోల్పోతూ వచ్చిన హృదయ జీవితంలో మరో కీలక మలుపు వస్తుంది. ప్రేమను మనసులో దాచుకోవడం వల్ల జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? చివరికి హృదయ తన భావాలను వ్యక్తం చేయగలిగాడా? అనే అంశాల చుట్టూ సాగే ప్రేమకథ ఇది. ప్రేమలో పడటం సహజమే అయినా, మనసులోని మాటను చెప్పుకోలేకపోవడం వల్ల ఏర్పడే అనుబంధాలు, అపార్థాలు, దూరాలను ఈ కథ ప్రధానంగా చూపిస్తుంది.

ప్రమాదం వెనుక అసలు నిజమేంటి ?

  • టైటిల్: వదలా
  • డైరెక్షన్: వంశీ కృష్ణ ఆకెళ్ల
  • కాస్ట్: జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్ 
  • ప్లాట్‌ఫాం: అమెజాన్ ప్రైమ్

శ్రీమంతుడైన డాక్టర్‌ యోగి (జగపతిబాబు) భార్య ప్రియ (లయ), పిల్లలు అప్పూ, చింటూతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. ప్రియ తండ్రి కూడా వారితోనే ఉంటాడు. ఓ ప్రమాదంలో గాయపడిన అముద (హృతిక శ్రీనివాస్)కు యోగి చికిత్స చేయించి, క్రమంగా ఆ కుటుంబానికి దగ్గరవుతున్న అముద.. యోగి, ప్రియల అన్యోన్యతను చూసి అసూయపడుతుంది. వారి ఆనందాన్ని దెబ్బతీయాలని నిర్ణయించుకుని, యోగికి కొత్త నంబర్ల నుంచి సందేశాలు పంపడం, బహుమతులు, పూలు పంపడం మొదలుపెడుతుంది. దీంతో ప్రియకి భర్తపై అనుమానం మొదలవుతుంది.

మరోవైపు పదేళ్ల క్రితం దీపావళి రోజు సిలిండర్ పేలడంతో మరణించిన నివాస్ (అవసరాల శ్రీనివాస్) కుటుంబానికి సంబంధించిన కేసులో కొత్త ఆధారం బయటపడుతుంది. పోలీస్ అధికారి పద్మాకర్ ఆ క్లూను పట్టుకుని దర్యాప్తు మొదలుపెడతాడు. నివాస్ కుటుంబానికి ఏం జరిగింది? ఆ ప్రమాదం వెనుక అసలు నిజమేంటి? అముద యోగి కుటుంబానికి ఎందుకు దగ్గరవుతుంది? ఆమె వల్ల యోగి, ప్రియ, వారి పిల్లల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేదే మిగతా కథ.

©️ VIL Media Pvt Ltd.