
కాట్మాండు: నేపాల్‌ను కబళించిన ఆకస్మిక వరదల వేళ ఒకే ఒక్క ఫోన్ కాల్ 1,643 మంది విద్యార్థులను రక్షించింది. ఉపాధ్యాయుడి సమయస్ఫూర్తితో విద్యార్థులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కొంచైం ఆలస్యమైనా విద్యార్థులంతా వరద ప్రవాహంలో కొట్టుకుపోయేవారు. విపత్తు సమయంలో ఉపాధ్యాయుడి ఆలోచన, క్విక్ డెసిషన్స్‌తో విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో ఆ ఉపాధ్యాయుడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
2026, ఆగస్ట్ 26న నేపాల్, టిబెట్ సరిహద్దులో జల ప్రళయం సృష్టించిన విషయం తెలిసిందే. ఉవ్వెత్తున ఎగిసిపడిన ఆకస్మిక వరదలతో నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా నువాకోట్ జిల్లాలోని త్రిశూలి వ్యాలీలో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం సృష్టించాయి. ఈ ఆకస్మిక వరదల సమయంలో త్రిశూలి వ్యాలీలో ఉన్న త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర దావాడీకి బుధవారం ఉదయం 9.20 గంటలకు ఒక మిత్రుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
త్రిశూలి వ్యాలీని భారీ వరద ముంచెత్తిందని.. ఇప్పటికే పై ఊరు కొట్టుకుపోయిందని చెప్పాడు. వెంటనే లోయను వదిలి కొండ ప్రాంతానికి పారిపోవాలని హెచ్చరించాడు. దావాడీకి ఫోన్ వచ్చిన సమయంలో పాఠశాలలో దాదాపు 900 మంది విద్యార్థులు ఉండగా.. మరో 700 మంది విద్యార్థులు బస్సులు, నడకమార్గం ద్వారా పాఠశాలకు వస్తున్నారు. అయితే, పాఠశాల భవనం నదికి 60 మీటర్ల ఎత్తులో కాంక్రీట్‌తో నిర్మించినందున తమకు ఎలాంటి ప్రమాదం ఉండదని దావాడి భావించారు.
ఇంతలోనే ఓ విద్యార్థి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి నీటి మట్టం చాలా వేగంగా పెరుగుతోందని.. వరద ఉధృతంగా ప్రవహిస్తోందని చెప్పడంతో దావాడి వెంటనే అప్రమత్తమయ్యారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పాఠశాల బెల్ మోగించి విద్యార్థులందరిని బయటకు వెళ్లిపోవాలని హెచ్చరించాడు. అలాగే, పాఠశాలకు పిల్లలతో వస్తున్న బస్సు డ్రైవర్లకు ఫోన్లు చేసి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించాడు. స్కూల్ సమీపంలోని ఒక బ్రిడ్జ్‌పై ఉన్న బస్సును గమనించి గట్టిగా అరిచి తిరిగి వెళ్లిపోవాలని సూచించాడు.
బస్సు తిరిగి వెనక్కి వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే వరద ఉధృతికి ఆ వంతెన కొట్టుకుపోయింది. చివరకు పాఠశాలలోని పిల్లలందరిని కొండపై ఉన్న ఎత్తైన ప్రాంతానికి తరలించారు. పిల్లలందరూ కొండపైకి చేరుకున్న నిమిషాల్లోనే ఆ మూడు అంతస్తుల పాఠశాల భవనం వరద ప్రవాహంలో నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. రాజేంద్ర దావాడీ సమయస్ఫూర్తితో 1,643 మంది విద్యార్థులు ప్రాణాలతో బతికి బయటపడ్డారు.
ఈ విషయం తెలియడంతో నేపాల్ ప్రజలందరూ అతడిని ఒక రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు. దురదృష్టవశాత్తూ స్కూల్ తలుపులు వేయడానికి వెళ్లిన అటెండర్ సుల్తాన్ లామా.. ఉదయాన్నే అదనపు తరగతులు ముగించుకుని నది ఒడ్డున ఉన్న తన గదికి వెళ్లిన సోషల్ హిస్టరీ టీచర్ సంతోష్ పరియార్ వరదల్లో కొట్టుకుపోయి మరణించారు.