Reading Time: 2 minutes
What Is Irumudi Meaning Spiritual Significance In Ayyappa Deeksha

రవితేజ హీరోగా ఇరుముడి అనే పేరుతో సినిమా వచ్చింది. జనం సినిమాకి కనెక్ట్ కావడంతో సినిమాకి కాసుల వర్షం కురుస్తోంది. అయితే ఈ ఇరుముడి అనే టైటిల్ పెట్టడానికి సినిమాలో రవితేజ అయ్యప్ప భక్తుడు కావడంతో పాటు మరో కారణం కూడా ఉందని దర్శకుడు చెప్పుకొచ్చారు. ఆ రెండో రీజన్ పక్కన పెట్టి అసలు ఇరుముడి అంటే ఏంటి? దాని విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యప్ప స్వామి దీక్షలో ‘ఇరుముడి’కి అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మికమైన స్థానం ఉంది. మలయాళంలో ‘ఇరు’ అంటే రెండు, ‘ముడి’ అంటే సంచి లేదా మూట. రెండు భాగాలతో కూడిన పవిత్రమైన మూటనే ఇరుముడి (ఇరుముడికెట్టు) అంటారు. దీన్ని శబరిమల యాత్రలో అయ్యప్ప స్వాములు తమ తలపై పెట్టుకుని భక్తిశ్రద్ధలతో తీసుకువెళతారు.

ఇరుముడిని రెండు భాగాలుగా కడతారు. ఒక్కో భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంది:
మున్ముడి (ముందు భాగం): ఇందులో పూర్తిగా స్వామివారికి సమర్పించే పవిత్రమైన పూజా ద్రవ్యాలు ఉంటాయి. ముఖ్యంగా నెయ్యితో నింపిన కొబ్బరికాయ (నెయ్ తేంగ), బియ్యం, కర్పూరం, అగరుబత్తులు, పసుపు, కుంకుమ, విభూతి లాంటివి ఇందులో భద్రపరుస్తారు.

పిన్ముడి (వెనుక భాగం): ఇది భక్తుడి లౌకిక లేదా వ్యక్తిగత అవసరాల కోసం ఉద్దేశించినది. అడవి మార్గంలో యాత్ర చేసేటప్పుడు భక్తుడికి అవసరమయ్యే ఆహార పదార్థాలు (అటుకులు, బెల్లం తదితరాలు), ఇతర వస్తువులు ఇందులో పెట్టుకుంటారు.

ఇరుముడి ఆధ్యాత్మిక విశిష్టత
ఇరుముడిలో అత్యంత ప్రధానమైనది నెయ్యితో నింపిన కొబ్బరికాయ. ఇందులో కొబ్బరికాయ మనిషి భౌతిక దేహానికి (జీవాత్మకు), లోపలి నెయ్యి స్వచ్ఛమైన భక్తికి (పరమాత్మకు) ప్రతీక. ఆ నెయ్యితో స్వామివారికి అభిషేకం చేయడం ద్వారా జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ముందు ఉండే ముడి (మున్ముడి) పుణ్యానికి లేదా ఆధ్యాత్మిక ప్రయాణానికి, వెనుక ఉండే ముడి (పిన్ముడి) లౌకిక బంధాలకు లేదా పాప కర్మలకు ప్రతీక అని వేదాంతం చెబుతుంది. యాత్ర పూర్తయ్యేసరికి వెనుక ముడిలోని ఆహారం ఖాళీ అవుతుంది, ముందు ముడిలోని నెయ్యి స్వామికి చేరుతుంది. అంటే మనిషి లౌకిక బంధాలను వదిలించుకుని మోక్షాన్ని పొందుతాడన్నది దీని ఆంతర్యం. శబరిమల ఆలయంలోని పవిత్రమైన 18 మెట్లు ఎక్కాలంటే తలపై ఇరుముడి కచ్చితంగా ఉండాల్సిందే. ఇరుముడి లేనిదే ఈ మెట్లు ఎక్కేందుకు ఏ భక్తుడికీ అనుమతి ఉండదు. భక్తుడు ఈ ఇరుముడిని స్వయంగా కట్టుకోకూడదు. ఎన్నో ఏళ్లుగా దీక్ష తీసుకుంటున్న గురుస్వామి చేతుల మీదుగా, శరణు ఘోషల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ ఇరుముడిని కట్టి భక్తుడి తలపై ఉంచుతారు. అప్పటి నుంచి ఆ భక్తుడు స్వయంగా అయ్యప్పతో సమానంగా పూజలందుకుంటాడు. రవితేజ సినిమాకు ‘ఇరుముడి’ అనే పేరు పెట్టడం వెనుక.. కర్మ, ప్రాయశ్చిత్తం, భారం మోస్తూ చేసే ఒక లక్ష్య ప్రయాణంకి సంబంధించిన బలమైన అర్థాన్ని సూచించే ఉద్దేశం ఉండి ఉండవచ్చు.