వాడిన పూల తొలగింపు, సాఫ్ట్ ప్రూనింగ్: మల్లె పూలు పూసి వాడిపోయిన తర్వాత వాటిని అలాగే ఉంచకూడదు. పువ్వు క్రింది చిన్న కొమ్మ వరకు కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల మొక్క విత్తనాలు తయారు చేసుకోవడంపై కాకుండా కొత్త రెమ్మలు, మొగ్గలు తొడగడంపై దృష్టి పెడుతుంది. అలాగే పూల సీజన్లో హార్డ్ ప్రూనింగ్ చేయకుండా కేవలం సాఫ్ట్ ప్రూనింగ్ మాత్రమే చేయాలి.
మట్టిని గుల్ల చేయడం & వెర్మీకంపోస్ట్ ఎరువు: ఎరువు వేసే ముందు కుండీలోని పైమట్టిని వేర్లు తెగిపోకుండా తేలికగా గుల్ల చేయాలి. దీనివల్ల వేర్లకు ప్రాణవాయువు సులభంగా అందుతుంది. ఆ తర్వాత 12 అంగుళాల కుండీకి రెండు గుప్పెళ్ల వర్మీకంపోస్ట్ వేసి మట్టిలో కలపాలి.
ఆవాల పిండి: వర్మీకంపోస్ట్తో పాటు ఒక టీస్పూన్ ఆవాల పొడిని- మిక్సీ పట్టి అయినా వేయవచ్చు 15–20 రోజులకు ఒకసారి మట్టిలో కలపాలి. ఇది మట్టిలో నెమ్మదిగా కరిగి సూక్ష్మజీవులను పెంచుతూ మొక్కకు సంపూర్ణ పోషణను అందిస్తుంది.
మొగ్గలు రాలకుండా సున్నపు ద్రావణం (కాల్షియం బూస్టర్): మల్లె మొగ్గలు రాలిపోవడానికి ప్రధాన కారణం కాల్షియం లోపం. దీని నివారణకు ఒక లీటర్ నీటిలో అర టీస్పూన్ పాన్ సున్నం కలిపి, కాసేపు ఉంచిన తర్వాత పైకి తేలిన స్వచ్ఛమైన నీటిని నెలకు ఒకసారి మొక్క మొదట్లో పోయాలి. ఇది కణజాల బలాన్ని పెంచి మొగ్గలు గట్టిగా నిలిచేలా చేస్తుంది.
ఎండ & తెగుళ్ల నివారణ: మల్లె మొక్కకు రోజుకు కనీసం 5–6 గంటల ప్రత్యక్ష సూర్యరశ్మి అందాలి. లేత ఆకుల వెనుక పురుగులు ఆశిస్తే లీటరు నీటిలో 5 ml వేపనూనె, కొద్దిగా మైల్డ్ షాంపూ కలిపి సాయంత్రం వేళ స్ప్రే చేయాలి. ఈ చిట్కాలు పాటిస్తే మీ మల్లె మొక్క సీజన్ మొత్తం గుబాళించే పూలతో కళకళలాడుతుంది!




