Reading Time: 2 minutes
Taapsee Pannu Telugu Re Entry With Merlapaka Gandhi Horror Film

Taapsee Pannu: తెలుగులో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను ఇప్పుడు మరోసారి టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారా? ప్రస్తుతం ఆమె సినిమాల కంటే వెబ్ సిరీస్‌లతో ఎక్కువగా బిజీగా ఉన్న నేపథ్యంలో, తెలుగులో ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈసారి ఆమె ఎంచుకోబోతున్న సినిమా జానర్ కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ‘కొరియన్ కనకరాజు’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు మేర్లపాక గాంధీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఓ హారర్ కథను సిద్ధం చేసుకున్నారట. ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం తాప్సీ పన్నును సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉందని, హీరోయిన్‌గా తాప్సీ ఇంకా ఆఫీషియల్ గా ఖరారు కాలేదని తెలుస్తోంది.

మేర్లపాక గాంధీ గతంలో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘మాస్ట్రో’, ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘కొరియన్ కనకరాజు’తో మంచి హిట్ ను కూడా అందుకున్నారు . ఇప్పుడు అదే దర్శకుడు మరో హారర్ కథతో ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఈసారి కథకు తాప్సీ లాంటి నటిని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. తాప్సీకి ఇప్పటికే లేడి ఓరియెంటెడ్ కథలతో మంచి అనుభవం ఉంది. తెలుగు చిత్రసీమలో ఆమె ‘ఝుమ్మంది నాదం’, ‘వస్తాడు నా రాజు’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘గుండెల్లో గోదారి’ వంటి సినిమాల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి కెరీర్‌ను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లారు.

తాప్సీ ప్రస్తుతం హిందీ సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ కనిపిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ కోసం ఆమె నటించిన ‘గాంధారి’ 2026 సెప్టెంబర్ 3న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేర్లపాక గాంధీ హారర్ కథ ఆమెకు నచ్చితే, చాలా కాలం తర్వాత తెలుగులో మరో ఆసక్తికరమైన పాత్రలో కనిపించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మించే అవకాశం ఉందని కూడా సమాచారం. అయితే హీరోయిన్ ఎంపిక నుంచి కథ, నటీనటులు, షూటింగ్ ప్రారంభం వరకు ఏ అంశంపైనా ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. తాప్సీతో చర్చలు సానుకూలంగా ముగిస్తేనే ఈ కాంబినేషన్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే, బాలీవుడ్‌లో తనదైన గుర్తింపు సంపాదించిన తాప్సీ పన్ను మళ్లీ తెలుగు సినిమాలో కనిపిస్తే అది ఆమె అభిమానులకు ప్రత్యేక ట్రీట్ అవుతుంది. అందులోనూ మేర్లపాక గాంధీ లాంటి దర్శకుడితో హారర్ కథలో ఆమె నటిస్తే, ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఇప్పటి నుంచే మొదలైంది. మరి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కుతుందా, తాప్సీ టాలీవుడ్ రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది చూడాలి.