Reading Time: 2 minutes
అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి హత్య కేసులో మరో ట్విస్ట్.. నిందితుడు ఎక్కడ దొరికాడంటే..

అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన యువతి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని హైదరాబాద్ పోలీసులు ఆగ్రాలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగగా.. నిందితుడిని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. హైదరాబాద్‌కు చెందిన నిఖిత గోదిశాల (27) అమెరికాలోని ఎల్లికాట్ సిటీలో నివసిస్తూ డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. జనవరి 2న ఆమె కనిపించకుండా పోయారు. అయితే అమెరికాలోని మేరీల్యాండ్‌లోని కొలంబియాలో ఉన్న తన మాజీ రూమ్‌మేట్ అర్జున్ శర్మ (26) అపార్ట్‌మెంట్‌లో నిఖిత మృతదేహం లభ్యమైంది. ఆమెపై కత్తితో పలుమార్లు దాడి జరిగినట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు గుర్తించారు. నిఖిత మృతి డిసెంబర్ 31, 2025 రాత్రి సుమారు 7 గంటల సమయంలో జరిగి ఉండొచ్చని అమెరికా అధికారులు భావించారు. జనవరి 4న ఉదయం 6 గంటల సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు.

నిఖిత హత్య కేసులో అర్జున్ శర్మపై అమెరికా పోలీసులు ఫస్ట్, సెకండ్ డిగ్రీ మర్డర్ అభియోగాలతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అయితే అప్పటికే నిందితుడు అమెరికా నుంచి భారత్‌కు పారిపోయినట్లు దర్యాప్తులో తేలింది. ఇదే సమయంలో నిఖిత తండ్రి ఆనంద్ గోదిశాల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌లోని లాలాపేట పోలీస్ స్టేషన్‌లో అర్జున్‌పై చీటింగ్ కేసు నమోదైంది. డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడంటూ ఏప్రిల్‌లో ఈ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు లభించిన కొన్ని కీలక ఆధారాలతో అర్జున్ ఆగ్రాలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో లాలాపేట పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఆగ్రాకు పంపించారు. అక్కడ ఓ ఫ్లాట్‌లో ఉన్న అర్జున్‌ను అదుపులోకి తీసుకుని చీటింగ్ కేసులో నోటీసు జారీ చేశారు. అయితే అమెరికాలో అతడిపై ఇప్పటికే క్రిమినల్ కేసు ఉండటంతో పాటు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) పెండింగ్‌లో ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ పోలీసులు కేంద్ర అధికారులకు సమాచారం అందించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలు అర్జున్ శర్మను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచాయి. ఆగస్టు 25న కోర్టు అతడిని అమెరికాలో నమోదైన హత్య కేసుకు సంబంధించి కస్టడీలోకి తీసుకుంది. నిఖిత కుటుంబం ఈ పరిణామంపై స్పందిస్తూ.. అర్జున్ శర్మను అదుపులోకి తీసుకోవడం కేసు దర్యాప్తులో ముఖ్యమైన ముందడుగు అని పేర్కొంది. నిఖిత గత నాలుగేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నారు. ఆమె కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటోంది. కుటుంబ సభ్యుల ప్రకారం.. 2025 ఆగస్టు-సెప్టెంబర్ సమయంలో అర్జున్ ఉద్యోగం కోల్పోయిన తర్వాత నిఖితతో పాటు ఆమె కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. నిఖితకు అర్జున్ చెల్లించాల్సిన డబ్బుల విషయంలో అప్పటికే ఆర్థిక వివాదాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అమెరికాలోని మరికొందరితోనూ అర్జున్‌కు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని వారు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..