
గుండె ఎడమవైపు కాకుండా కుడివైపు ఉంటే ఏమవుతుంది? ఆ అరుదైన మెడికల్ కండిషన్‌తో ఒక మనిషి జీవితం ఎలాంటి ప్రమాదకరమైన మలుపులు తిరుగుతుంది? ఈ డిఫరెంట్ అండ్ క్రేజీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కికు చిరంజీవి’. శోభన్ బాబు నాటి పాత టైటిల్ వివాదం కారణంగా ‘చిరంజీవి’ నుంచి ‘కికు చిరంజీవి’గా పేరు మార్చుకున్న ఈ మూవీ ఈ రోజు ( ఆగస్టు 28, 2026 ) థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ మేర మెప్పించిందో చూద్దాం..
కథేంటంటే..
అరకులో ఫోటోగ్రాఫర్‌గా పనిచేసే చిరంజీవి (కికు యనమల)కి పుట్టుకతోనే ఒక విచిత్రమైన సమస్య ఉంటుంది. అతనికి గుండె కుడివైపు ఉంటుంది, దాంతో ఎక్కువ పరిగెత్తితే ఊపిరి ఆడక శరీరం నీలంగా మారిపోతుంది. అలాంటి చిరు, హైదరాబాద్ నుంచి అరకు విహారయాత్రకు వచ్చిన మను (కశిశ్ ఖాన్)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ, మనుని ఇష్టపడిన ప్రతీ ఒక్కరినీ ఒక అజ్ఞాతవ్యక్తి దారుణంగా హత్య చేస్తుంటాడు. ఈ ప్రాణాపాయాల నుంచి తప్పించుకుని, పెద్దలను ఒప్పించి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు.
కట్ చేస్తే.. శోభనం రోజు రాత్రి మనుకి ఒక మైండ్ బ్లాకింగ్ షాక్ తగులుతుంది. తన భర్త గుండె కుడివైపు కాకుండా ఎడమవైపు కొట్టుకోవడం ఆమె గమనిస్తుంది. అసలు ఆమె పక్కన ఉన్నది ఎవరు? సైకోలా ప్రవర్తిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? తనికెళ్ల భరణి పాత్ర వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈశ్వరీరావు ఎంట్రీతో కథ ఎలాంటి మలుపు తిరిగింది? అన్నదే మిగతా సినిమా.
ఎలా ఉందంటే?
దర్శకుడు శుభ సాయి వెంకట్ ఎంచుకున్న మెడికల్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ల రొమాన్స్, ట్రిప్ సీన్లు కొంత సీరియల్‌లా సాగినా, ఇంటర్వెల్ ముందు వచ్చే ‘హార్ట్ ట్విస్ట్’ సీట్ ఎడ్జ్ ఫీలింగ్ ఇస్తుంది. సెకండాఫ్‌ను దర్శకుడు పక్కా థ్రిల్లర్ మోడ్‌లోకి మార్చేసి రక్తికట్టించాడు. ఆ రాత్రి నా పక్కన ఉన్నది ఎవరు? అని హీరోయిన్ పడే టెన్షన్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ పెంచుతుంది.
నటుడిగా తొలి చిత్రమే అయినా కికు యనమల వేరియేషన్స్ చూపించి ఆకట్టుకున్నాడు. కశిశ్ ఖాన్, ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి తమ పాత్రలకు న్యాయం చేశారు. రామకృష్ణ విజువల్స్, శేఖర్ చంద్ర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ సీన్లకు ప్రాణం పోశాయి. తొలిభాగంలో కథనం కాస్త నెమ్మదించినా, సెకండాఫ్‌లోని ఊహించని ట్విస్టులు, సస్పెన్స్ ఎలిమెంట్స్ థ్రిల్లర్ లవర్స్‌కు మంచి కిక్ ఇస్తాయి. కొత్తదనం కోరుకునేవారికి ‘కికు చిరంజీవి’ ఈ వీకెండ్‌కు ఒక క్రేజీ ఛాయిస్. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.