Reading Time: 2 minutes
NTA Director: ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్ వి. ప్రసన్న వెంకటేష్

NTA Director: నీట్, జేఈఈ వంటి కీలక జాతీయ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కేంద్ర ప్రభుత్వం నూతన డైరెక్టర్‌ను నియమించింది. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేష్‌ను ఎన్‌టీఏ డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ఆయన ఐదేళ్ల కాలం పాటు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏది ముందైతే అప్పటి వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. 2012 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్ ఐపీఎస్ అధికారి రవి కుమార్ సింగ్‌ను మరో డైరెక్టర్‌గా, 2016 బ్యాచ్ ఐఆర్‌ఎస్ (కస్టమ్స్ అండ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్) అధికారి అమిత్ సాందారియాను జాయింట్ డైరెక్టర్‌గా (డిప్యూటీ సెక్రటరీ స్థాయి) నియమించారు. రవి కుమార్ సింగ్ కూడా ఐదేళ్లు, అమిత్ సాందారియా నాలుగేళ్లు పనిచేయనున్నారు.

ఎవరీ ప్రసన్న వెంకటేష్ ?

ప్రసన్న వెంకటేష్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం (కోయంబత్తూరు) నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన ప్రసన్న వెంకటేష్ 2012లో ఐఏఎస్‌లో చేరారు. పాడేరు సబ్-కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఏపీ సీఆర్‌డీఏ అదనపు కమిషనర్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, పోర్ట్స్ డైరెక్టర్, కర్నూలు జాయింట్ కలెక్టర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2019లో విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి పారిశుధ్యం, చెత్త నిర్వహణ, నీటి సరఫరా, ట్రాఫిక్, నగర హరితీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఆ తర్వాత ఏలూరు జిల్లా తొలి కలెక్టర్‌గా జనవరి 2022 – జూలై 2024 వరకు సేవలందించారు. అనీమియా నియంత్రణ, గిరిజన ప్రాంతాల్లో అక్షజ కార్యక్రమం వంటి చొరవలతో ప్రధానమంత్రి అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2023 అందుకున్నారు. Mm ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

నీట్ పేపర్ లీకేజీ, పరీక్షల అవకతవకల నేపథ్యంలో ఎన్‌టీఏ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో కేంద్రం NTA ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర, జిల్లా స్థాయి పరిపాలనా అనుభవం ఉన్న ప్రసన్న వెంకటేష్ వంటి అధికారులను కీలక బాధ్యతల్లో కేంద్రం నియమించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి