Reading Time: 2 minutes
29 ఏళ్లకే రిటైర్‌మెంట్.. ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి ఈ అమ్మాయి ఏం చేస్తుందో చూడండి! వీడియో

సాధారణంగా రిటైర్‌మెంట్ అంటే 50 లేదా 60 ఏళ్ల తర్వాత ఉద్యోగ జీవితానికి వీడ్కోలు పలకడం జరుగుతుంది. కానీ ఓ యువతి మాత్రం కేవలం 29 ఏళ్లకే తాను రిటైర్ అయ్యానంటూ సోషల్ మీడియాలో చేసిన ప్రకటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రిటైర్‌మెంట్‌ అనంతరం ఉద్యోగ ఒత్తిళ్లకు దూరంగా ప్రకృతి మధ్య, వ్యవసాయ ఆధారిత జీవనాన్ని ఎంచుకున్నట్లు ఆమె వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో @baapbetifarm పేరుతో స్నేహ రాజ్‌గురు తన ‘రిటైర్‌మెంట్’ ఆలోచనను నెటిజన్లతో పంచుకున్నారు. తన దృష్టిలో రిటైర్‌మెంట్ అంటే పని చేయడం పూర్తిగా ఆపేయడం కాదని.. ఒత్తిడితో కూడిన జీవితం నుంచి ప్రశాంతమైన జీవన విధానాన్ని ఎంచుకోవడమేనని ఆమె చెబుతున్నారు. ఇందుకోసం నాలుగు కీలకమైన దశలను సూచించారు..

కొంత భూమిని కొనుగోలు చేసి.. మీకంటూ ఓ గుర్తింపు ఇవ్వండి

మొదటగా చిన్న స్థలం, కొంత భూమిని కొనుగోలు చేసి, దానికి వ్యక్తిగత గుర్తింపును ఇవ్వాలని స్నేహ సూచిస్తున్నారు. తన BaapBeti Farmను ఇందుకు ఉదాహరణగా చూపించారు. తనకు నచ్చిన విధంగా ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ.. ప్రకృతికి దగ్గరగా జీవించేలా ఒక సొంత ప్రపంచాన్ని నిర్మించుకోవాలని ఆమె చెబుతున్నారు.

పండ్ల చెట్లను నాటండి

రెండో దశలో ఆ భూమిలో పండ్ల చెట్లను పెంచాలని సూచించారు. పండ్ల చెట్లు పెరగడానికి కొంత సమయం పట్టినా, ఆ తర్వాత చాలా కాలం పాటు ఫలాలను అందిస్తాయని ఆమె అంటున్నారు. అంతేకాదు.. ఇతర పంటలతో పోలిస్తే వీటికి ఎక్కువ శ్రమ అవసరం ఉండదని, మనతో పాటు చెట్లు కూడా పెరుగుతూ భవిష్యత్తులో ఫలాలను అందిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

సొంతంగా ఆహారాన్ని పండించుకోండి

మూడో దశలో మనకు అవసరమైన ఆహారాన్ని సాధ్యమైనంత వరకు మనమే పండించుకోవాలని ఆమె చెబుతున్నారు. ఇది ఆహార భద్రతతో పాటు స్వయం సమృద్ధికి కూడా ఉపయోగపడుతుందని వివరించారు. లాక్‌డౌన్, యుద్ధం వంటి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు బయట వ్యవస్థలపై పూర్తిగా ఆధారపడకుండా ఉండేందుకు సొంతంగా ఆహారాన్ని పండించుకోవడం సహాయపడుతుందని ఆమె అంటున్నారు.

చుట్టూ పూలతో అందాన్ని నింపండి

నాలుగో దశ మాత్రం వ్యవసాయం కంటే మనసుకు సంబంధించినది. తమ సొంత భూమి చుట్టూ అందమైన పూల మొక్కలను పెంచి.. ప్రతిరోజూ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా వాతావరణాన్ని సృష్టించుకోవాలని స్నేహ సూచించారు. ప్రతిరోజూ మన కళ్ల ముందు అందమైన వాతావరణం కనిపిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం కడుపు నింపే స్థలంగా కాకుండా.. మనసుకు, ఆత్మకు ఆనందాన్ని ఇచ్చే ప్రదేశంగా తమ స్థలాన్ని మార్చుకోవాలని ఆమె చెబుతున్నారు.

వయసు కాదు.. ప్రశాంతతే అసలైన రిటైర్‌మెంట్

స్నేహ రాజ్‌గురు చెప్పిన ‘రిటైర్‌మెంట్’ భావన ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేయడం కంటే భిన్నంగా ఉంది. జీవితం మొత్తం ఒత్తిడి, పోటీ, సంపాదన చుట్టూ తిరగకుండా.. మనకు నచ్చిన జీవన విధానాన్ని ఎంచుకోవడమే అసలైన రిటైర్‌మెంట్ అని ఆమె అంటున్నారు. రిటైర్‌మెంట్ అనేది వయసు గురించి కాదు.. ఒత్తిడికి బదులుగా ప్రశాంతతను ఎంచుకోవడం గురించి అనే ఆమె మాటలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. వ్యవసాయం, సొంత ఆహారం, ప్రకృతి, స్వయం సమృద్ధి వంటి అంశాలను కలిపి ఒక ప్రత్యామ్నాయ జీవన విధానాన్ని ఆమె చూపిస్తున్నారు. అందుకే 29 ఏళ్లకే రిటైర్‌మెంట్ ప్రకటించానంటూ ఆమె చేసిన తన పోస్టులో నెటిజన్లకు వివరించారు. ఆలోచిస్తే ఇదీ కూడా బాగానే.. ఉంది కదూ..!