
శ్రీలంక క్రికెట్‌లో కొత్త తరం ప్రతిభావంతుడిగా దినూష పేరు వేగంగా వినిపిస్తోంది. బ్యాటింగ్‌లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా.. సమస్యను గుర్తించి, దానికి పరిష్కారం కనుగొని ఆచరణలో పెట్టడం అతని ప్రత్యేకత. ఇటీవల టెస్టు క్రికెట్‌లో అతను చూపిస్తున్న అద్భుతమైన ప్రదర్శనల వెనుక ఇలాంటి క్రమశిక్షణ, కష్టపడే తత్వమే ఉందని అతనితో పనిచేసిన కోచ్‌లు చెబుతున్నారు. అభిమానులు అయితే శ్రీలంకలో దినూష రూపంలో మరో సచిన్ పుట్టాడు అని అంటున్నారు. మరి నిజంగానే అంతనిలో అంత టాలెంట్ ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
షార్ట్ బాల్స్ సమస్యగా మారినప్పుడు..
2025 జూలైలో డార్విన్‌లో శ్రీలంక ‘ఎ’ జట్టు తరఫున ఆడుతున్న సమయంలో దినూషకు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు పేసర్ల నుంచి గట్టి పరీక్ష ఎదురైంది. ఆరు అడుగులకు పైగా ఎత్తున్న మిచెల్ పెర్రీ, లియామ్ స్కాట్, హెన్రీ థోర్న్‌టన్ వేగంగా షార్ట్ బాల్స్, బౌన్సర్లు సంధించారు. పొట్టి బ్యాటర్ అయిన దినూష తొలుత ఇబ్బంది పడ్డాడు. అయితే సమస్యతో ఆగిపోలేదు. కోచ్‌లతో చర్చించి వ్యూహాన్ని మార్చుకున్నాడు. తనకు ఎదురవుతున్న బంతులను పోలిన త్రోడౌన్‌లను ప్రాక్టీస్ చేశాడు. ఫలితం కూడా వెంటనే కనిపించింది. తొలి అనధికారిక టెస్టులో 145 బంతుల్లో 105 పరుగులు, రెండో మ్యాచ్‌లో 191 బంతుల్లో 88 పరుగులు సాధించాడు.
చిన్న వయసులోనే ప్రత్యేక ప్రతిభ
దినూష క్రికెట్ ప్రయాణం పాఠశాల స్థాయి నుంచే మొదలైంది. కొలంబోలోని డి లా సల్లే కాలేజీలో 12 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అక్కడి కోచ్ సోనల్ దుల్షన్ అతని ప్రతిభను తొలినాళ్లలోనే గుర్తించారు. అనంతరం మహానామ కాలేజీకి మారిన దినూష అక్కడ కూడా తన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2020లో రిచ్‌మండ్ కాలేజీతో జరిగిన అండర్-19 డివిజన్-1 మ్యాచ్‌లో అతని పట్టుదలకు అద్దం పట్టే ఇన్నింగ్స్ ఆడాడు. 20/3 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన అతను ఏకంగా 227 బంతులు ఎదుర్కొని అజేయంగా 159 పరుగులు చేశాడు. 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
18 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ అరంగేట్రం
మహానామ కాలేజీలో చదువుతున్న సమయంలోనే 2018లో కొలంబో క్రికెట్ క్లబ్ తరఫున దినూష ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటికి అతని వయసు 18 ఏళ్లకు కూడా పూర్తిగా చేరలేదు. ధమ్మిక ప్రసాద్, నువాన్ ప్రదీప్, సచిత్ర సేనానాయకే వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌పై అరంగేట్రం చేశాడు. అప్పటి క్లబ్‌కు సంబంధించిన అషాన్ ప్రియంజన్ అతని తొలి మ్యాచ్‌ను ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. సాధారణంగా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసే దినూషను జట్టు అవసరాల కోసం మూడో స్థానంలో పంపించగా.. మంచి బౌలింగ్ దాడిని ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించాడు. అప్పుడే అతనిలోని ప్రత్యేక సామర్థ్యం కనిపించిందని ప్రియంజన్ పేర్కొన్నారు.
స్వీప్ షాట్‌పై ప్రత్యేక పట్టు
దినూష బ్యాటింగ్‌లో స్వీప్ షాట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. భారత్‌తో జరిగిన రెండు టెస్టుల్లో కేవలం స్వీప్ షాట్‌తోనే అతను 173 పరుగులు సాధించడం అతని నైపుణ్యానికి నిదర్శనం. అయితే ఈ షాట్ అతనికి సహజంగానే వచ్చిందని భావించడం పొరపాటేనని కోచ్‌లు చెబుతున్నారు. నెట్స్‌లో గంటల తరబడి స్వీప్ షాట్‌ను సాధన చేసేవాడని ప్రియంజన్ తెలిపారు. సాధారణ బ్యాటింగ్ ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత కూడా ప్రత్యేకంగా త్రోడౌన్‌లు తీసుకుని అదే షాట్‌ను మెరుగుపరుచుకునేవాడని వెల్లడించారు.
టెస్టు క్రికెట్‌పై క్లారిటీ
శ్రీలంక హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కూడా దినూష ఆటతీరును మెచ్చుకున్నారు. ఒత్తిడిలోనూ తన బలాలకు అనుగుణంగా ఆడటం, బౌలర్లు ఏం చేయాలనుకుంటున్నారో ముందుగానే అర్థం చేసుకోవడం అతని ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఇటీవల 264 బంతుల్లో 133 పరుగులు చేసిన అతని ఇన్నింగ్స్‌ను శ్రీలంక టెస్టు క్రికెట్ చరిత్రలో గొప్ప రక్షణాత్మక ఇన్నింగ్స్‌లలో ఒకటిగా కిర్‌స్టన్ అభివర్ణించారు. దినూషకు టెస్టు క్రికెట్‌పై మంచి అవగాహన ఉందని, ప్రతి బంతిని ఆలోచించి ఎదుర్కొంటాడని అన్నారు.
విజయంతో సంతృప్తి చెందని దినూష
వరుస విజయాలు, సెంచరీలు సాధించినా దినూష మాత్రం అక్కడితో ఆగడం లేదు. ఒక మ్యాచ్ ముగిసిన వెంటనే తదుపరి టోర్నమెంట్ కోసం ప్రాక్టీస్ గురించి ఆలోచించడం అతని పని తీరుకు నిదర్శనం. ఆగస్టు 28న కొలంబో క్రికెట్ క్లబ్ తరఫున టీ20 లీగ్ టోర్నమెంట్ కోసం ప్రాక్టీస్‌కు హాజరయ్యేందుకు కూడా సిద్ధమయ్యాడు. ఆగస్టు 31న పనదురలో జరిగే మేజర్ లీగ్ 50 ఓవర్ల టోర్నమెంట్‌లో పాల్గొననున్న అతను, ఆ తర్వాత కొలంబోలో జరిగే టీ20 ఈవెంట్‌లోనూ ఆడనున్నాడు.
శ్రీలంకకు విలువైన ఆణిముత్యం
దినూష ప్రయాణం చూస్తే అతని ప్రతిభకు తోడు కష్టపడే స్వభావమే అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతోందని స్పష్టమవుతోంది. సమస్య ఎదురైతే భయపడకుండా దాన్ని విశ్లేషించడం, పరిష్కారం కోసం సాధన చేయడం అతని ప్రధాన బలం. శ్రీలంకలోని పటిష్టమైన పాఠశాల క్రికెట్ వ్యవస్థ కూడా అతని ఎదుగుదలకు కీలకంగా మారింది. ఇప్పుడు ఈ యువ ప్రతిభకు సరైన అవకాశాలు కల్పించి, అత్యున్నత స్థాయిలో స్వేచ్ఛగా ఆడేలా చూడాల్సిన బాధ్యత శ్రీలంక క్రికెట్‌దే.