Reading Time: 2 minutes
Eye Glasses: కళ్లద్దాలు వాడితే కంటి పవర్ పెరుగుతుందా? చాలా మందికి ఉన్న పెద్ద అపోహా ఏంటి?

Eye Glasses: కళ్లద్దాలు వాడటం వల్ల కంటి పవర్ పెరుగుతుందనేది, లేదా వాటికి అలవాటుపడితే చూపు తగ్గిపోతుందనేది చాలామందిలో ఉన్న ఒక పెద్ద అపోహ అని పద్మశ్రీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ కంటి వైద్యులు డాక్టర్ ఎ. సాయిబాబా గౌడ్ స్పష్టం చేశారు. కంటి పరీక్షలకు వచ్చే రోగులు తరచుగా తమను ఈ ప్రశ్నలు అడుగుతుంటారని, అద్దాలకు బదులుగా ఐ డ్రాప్స్ లేదా ఆహార మార్పుల ద్వారా చూపును మెరుగుపరచుకోవచ్చా అని ఆరా తీస్తారని ఆయన వెల్లడించారు. ఈ అపోహలలో ఏ మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

కళ్లద్దాలు వాడటం వల్ల పవర్ పెరుగుతుందా?

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కళ్లద్దాలు వాడటం వల్ల కంటి పవర్ పెరగదు. చూపు తక్కువ ఉన్నవారు తప్పనిసరిగా అద్దాలు ధరించాల్సిందేనంటున్నారు. అద్దాలు అవసరమైనప్పుడు వాడకపోతే కంటిపై అనవసరమైన ఒత్తిడి పెరిగి, అలసట ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో మరింత ఇబ్బందులకు దారితీయవచ్చు. కంటి వైద్యులు అద్దాలను సూచించినట్లయితే, పవర్ చిన్నదైనా, పెద్దదైనా వాటిని తప్పనిసరిగా వాడటం వల్ల కంటి ఆరోగ్యం కాపాడబడుతుంది. కొంత మంది తక్కువ ధరల్లో ఉన్న కంటి అద్దాలను తీసుకుంటారని, కానీ అద్దాలను బట్టి రేట్లు ఉంటాయన్నారు.

ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!

పిల్లలు, పెద్దలలో కంటి పవర్ మార్పులు:

చిన్నపిల్లల్లో 21 సంవత్సరాల వయస్సు వరకు శరీరంలో ప్రతి భాగం పెరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా కంటి పవర్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఇది సహజమైన ప్రక్రియే తప్ప, అద్దాలు వాడటం వల్ల పవర్ పెరుగుతుంది అనడం సరికాదు. పెద్దవారికి కూడా వయసుతో పాటు కంటి పవర్ మారవచ్చు. అవసరమైనప్పుడు కంటి పరీక్షలు చేయించుకొని, పవర్‌కు తగ్గ అద్దాలను మార్చుకోవలసి ఉంటుంది. తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం ముఖ్యమని డాక్టర్ నొక్కి చెప్పారు.

అద్దాలను నిర్లక్ష్యం చేయవద్దు:

కొంతమంది ముఖ్యంగా నలభై సంవత్సరాలు దాటినవారు దగ్గర చూపు సమస్య ఉన్నప్పటికీ అద్దాలు వాడటానికి సంకోచిస్తుంటారు. పుస్తకాలు లేదా వస్తువులను దూరంగా పెట్టుకొని చదవడానికి లేదా చూడటానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా పదేళ్లపాటు అద్దాలు లేకుండా నెట్టుకువచ్చిన వారు కూడా ఉంటారని డాక్టర్ తెలిపారు. అయితే ఈ అలవాటు కంటికి మంచిది కాదని, ఏ చిన్న దృష్టి లోపం ఉన్నప్పటికీ వెంటనే అద్దాలు వాడటం ద్వారా మన చూపును కాపాడుకోవడం మన బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. జీవితాంతం రెండు కళ్ళ చూపు మనకు అవసరం కాబట్టి, కంటి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.

అలాగే, ఒకరి అద్దాలను మరొకరు వాడటం సరికాదని సూచిస్తున్నారు. చాలామంది ఇంట్లో భార్యాభర్తల్లో ఒకరికి అద్దాలు ఉంటే, వాటినే ఇద్దరూ వాడటం జరుగుతుందని, కానీ ప్రతి ఒక్కరి దృష్టి లోపం వేర్వేరుగా ఉంటుందని, అందుకే వ్యక్తిగత అద్దాలను మాత్రమే వాడాలని ఆయన అన్నారు.

కళ్లద్దాలు వాడటం వల్ల కంటి పవర్ పెరుగుతుంది అనేది కేవలం ఒక అపోహ మాత్రమే. కంటి వైద్యుడు డాక్టర్ సాయిబాబా గౌడ్ సూచనల మేరకు, అవసరమైనప్పుడు కళ్లద్దాలు ధరించడం, తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటి చూపును రక్షించుకోవచ్చు.

ఇది కూడా చదవండి: BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ప్లాన్‌.. చౌకైన రీఛార్జ్‌తో 412 రోజుల వ్యాలిడిటీ..!

ఇది కూడా చదవండి: September Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి