
కర్ణాటకకు చెందిన ఓ 30 ఏళ్ల మహిళ చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ఎంతో కష్టపడి చదివి మంచి ర్యాంక్ సాధించిన ఆమె చివరి దశైన ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె ధైర్యంగా సమాధానాలు ఇస్తూ ముందుకు సాగారు. ఎక్కడా తడబడకుండా సమాధానాలు చెప్పడంతో ఒక సీనియర్ అధికారి ఆమెను మరింత పరీక్షించాలని భావించారు. ఈ క్రమంలో ఓ ఊహించని ఊహాజనిత ప్రశ్నను సంధించారు.
‘మీ భర్త చనిపోయాడు. ఆ తర్వాత మీరు రెండో వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి చనిపోయిన మీ మొదటి భర్త తిరిగి వస్తే మీరు ఏం చేస్తారు?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న విన్న వెంటనే అభ్యర్థి కాసేపు ఆలోచించినప్పటికీ.. వెంటనే తేరుకుని సమాధానం ఇచ్చింది. ‘చనిపోయిన వ్యక్తి తిరిగి రావడం ఎలా సాధ్యమవుతుంది?’ అని ప్రశ్నలోని ఊహాజనిత అంశాన్ని మాత్రమే పట్టుకుని సమాధానం చెప్పకుండా.. ఆ ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. తాను చెప్పిన సమాధానంలో వివాహం, మరణ ధ్రువీకరణ పత్రం వంటి చట్టపరమైన అంశాలను ప్రస్తావిస్తూ.. ఒక వ్యక్తి మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించబడిన తర్వాత, ఆ ధ్రువీకరణ ఆధారంగా అతని భార్య చట్టబద్ధంగా మరో వివాహం చేసుకున్న పరిస్థితిని ఊహిస్తే, ఆ తర్వాత మొదటి భర్త తిరిగి వచ్చినా రెండో వివాహం విషయంలో పరిస్థితిని చట్టపరంగా పరిశీలించాల్సి ఉంటుందని ఆమె వివరించింది. అయితే చివరికి తాను ఎవరితో జీవించాలనేది తన వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించిన అంశమని సమాధానం ఇచ్చింది.
సమయస్ఫూర్తిని పరీక్షించేందుకే ప్రశ్న?
ఈ ప్రశ్న వెనుక ప్రధాన ఉద్దేశం అభ్యర్థిని గందరగోళానికి గురిచేయడం కాదని.. ఆమె తార్కికంగా ఎలా ఆలోచిస్తుంది, ఊహాజనిత పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుంది, చట్టపరమైన అంశాలను ఎలా అన్వయిస్తుంది అనే విషయాలను పరీక్షించడమేనని కథనం చెబుతోంది. ఆమె సమాధానంతో సంతృప్తి చెందిన ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు అభినందించారు. సివిల్స్ ఇంటర్వ్యూ అంటే పుస్తకాల్లో చదివిన విషయాలను అప్పగించడమే కాదు. అభ్యర్థి వ్యక్తిత్వం, సమస్యను విశ్లేషించే విధానం, ఒత్తిడిలో నిర్ణయం తీసుకునే సామర్థ్యం, సమయస్ఫూర్తి వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్నలు ఎదురైనప్పుడు తొందరపడి సమాధానం చెప్పకుండా ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకుని, తార్కికంగా మరియు ప్రశాంతంగా స్పందించడం చాలా ముఖ్యం. మొత్తానికి.. సివిల్స్ ఇంటర్వ్యూలో అభ్యర్థి ఎంత చదివాడన్నదే కాదు, ఒక ప్రశ్నను ఎంత లోతుగా అర్థం చేసుకుని, సరైన సమయంలో సరైన కోణంలో సమాధానం ఇస్తాడన్నది కూడా కీలకం. ఇలాంటి ప్రశ్నలు అభ్యర్థుల సమయస్ఫూర్తి, తార్కిక ఆలోచనా శక్తికి నిజమైన పరీక్షగా నిలుస్తాయి.