July 16, 2026

Viral News: చివరి వరకు తోడుగా నిలిచిన నమ్మిన బంటు.. యజమాని మరణంతో ప్రాణాలు విడిచిన శునకం!

Viral News: చివరి వరకు తోడుగా నిలిచిన నమ్మిన బంటు.. యజమాని మరణంతో ప్రాణాలు విడిచిన శునకం!
Reading Time: < 1 minute
Viral News: చివరి వరకు తోడుగా నిలిచిన నమ్మిన బంటు.. యజమాని మరణంతో ప్రాణాలు విడిచిన శునకం!

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. 15 ఏళ్లుగా తన యజమానితో కలిసి జీవించిన ఓ పెంపుడు కుక్క, యజమాని మరణాన్ని తట్టుకోలేక చివరికి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన అక్కడి ప్రజలను కన్నీటి పర్యంతం చేసింది.

సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల ప్రదీప్ జైన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం భోపాల్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. అనంతరం ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన బేతుల్‌కు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు అంతా శోకసంద్రంలో మునిగిపోయిన వేళ, ఆయనకు అత్యంత ఆప్తుడైన 15 ఏళ్ల పెంపుడు కుక్క ‘దుగ్గు’ కూడా తీవ్ర ఆవేదనకు గురైంది.

యజమాని మృతదేహాన్ని ఇంట్లో ఉంచినప్పటి నుంచి దుగ్గు ఆయన వద్దకే వెళ్లాలని ప్రయత్నించింది. మృతదేహాన్ని వదిలి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు దానిని మరో గదిలో ఉంచారు. రాత్రంతా అది ఏడుస్తూ అశాంతిగా గడిపింది. యజమాని లేచి వస్తాడనే ఆశతో ఎదురుచూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరుసటి రోజు అంత్యక్రియల ఊరేగింపు ప్రారంభమైనప్పుడు దుగ్గును కూడా బయటకు తీసుకువచ్చారు. యజమాని శవపేటిక వెంట కొన్ని అడుగులు మాత్రమే నడిచిన తర్వాత అది ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఈ దృశ్యం అక్కడున్న వారిని తీవ్రంగా కలిచివేసింది.

ప్రదీప్ జైన్ తమ్ముడు దిలీప్ జైన్ మాట్లాడుతూ, దుగ్గు తమ కుటుంబంలో ఒక సభ్యుడిలా ఉండేదని చెప్పారు. చిన్నప్పటి నుంచే ప్రదీప్ జైన్ దానిని ఎంతో ప్రేమగా పెంచారని, ఆయన అనారోగ్యానికి గురైనప్పుడల్లా దుగ్గు కూడా ఆహారం మానేసి నీరసంగా ఉండేదని గుర్తు చేశారు. యజమాని పట్ల అపారమైన విశ్వాసాన్ని చాటిన దుగ్గుకు కుటుంబ సభ్యులు కూడా గౌరవప్రదంగా వీడ్కోలు పలికారు. ప్రదీప్ జైన్‌కు హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించగా, దుగ్గును అదే శ్మశానవాటిక సమీపంలో ఖననం చేశారు. మనిషి–మూగజీవి మధ్య ఉన్న అనుబంధానికి ఈ ఘటన అరుదైన ఉదాహరణగా నిలిచింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..