సోనమ్ వాంగ్ చుక్కు మద్దతుగా హైదరాబాద్‌లో క్యాండిల్ ర్యాలీ

హైదరాబాద్: నీట్ 2026 పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు మద్దతుగా ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. గురువారానికి (జూలై 16) ఆయన దీక్ష 19వ రోజుకు చేరుకోవడంతో సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో హైదరాబాద్‌లోని పౌర సమాజ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు సంఘీభావంగా గురువారం (జూలై 16) సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించాయి. అనంతరం విద్యార్థుల హక్కుల పరిరక్షణ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని రద్దు చేయడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ మార్గ్‌లోని 130 అడుగుల అంబేడ్కర్ విగ్రహం దగ్గర భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో యువత, నిరుద్యోగులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చాయి.