July 16, 2026

జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య సందేశం? ట్రంప్ బృందంపై ‘యుద్ధ లాభాల’ ఆరోపణలు!

జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య సందేశం? ట్రంప్ బృందంపై ‘యుద్ధ లాభాల’ ఆరోపణలు!
Reading Time: 2 minutes

జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య సందేశం? ట్రంప్ బృందంపై ‘యుద్ధ లాభాల’ ఆరోపణలు!

Caption of Image.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్‌పై ఇరాన్ సంచలన ఆరోపణలు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. యుద్ధాన్ని ముగించే చర్చల సమాచారాన్ని ఉపయోగించి ఆర్థిక లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఇరాన్ ఆరోపించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలను వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది.

జేడీ వాన్స్‌కు రహస్య సందేశం పంపిందా ఇరాన్?
జూన్ చివరిలో స్విట్జర్లాండ్‌లోని లేక్ లూసెర్న్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల సమయంలో మధ్యవర్తి ద్వారా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఇరాన్ ఓ సందేశాన్ని పంపినట్లు పేర్కొంది. విట్‌కాఫ్, కుష్నర్ కొనసాగుతున్న చర్చల్లో కీలక పాత్ర పోషిస్తే శాంతి ఒప్పందం సాధించే ప్రయత్నాలకు నష్టం కలుగుతుందని ఇరాన్ హెచ్చరించినట్లు తెలిపింది. ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు తమ వద్ద ఉన్న సమాచారాన్ని మధ్యవర్తుల ద్వారా అమెరికాకు చేరవేశామని పేర్కొన్నారు. చర్చల వివరాలు ఆర్థిక మార్కెట్లలో ప్రయోజనం పొందేందుకు ఉపయోగించబడుతున్నాయనే అనుమానాలను కూడా వ్యక్తం చేసినట్లు రిపోర్ట్స్ వచ్చాయి.

9 బిలియన్ డాలర్ల లాభాల ఆరోపణ..
ఇరాన్ అందించినట్లు చెబుతున్న పత్రాల్లో, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, దౌత్య పరిణామాలను ఆధారంగా చేసుకుని కొంతమంది వ్యక్తులు మార్కెట్లను ప్రభావితం చేశారని ఆరోపించినట్లు సమాచారం. ఈ పరిణామాల ద్వారా దాదాపు 9 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.లక్ష కోట్లు లాభాలు వచ్చాయని ఇరాన్ అంచనా వేసినట్లు నివేదిక పేర్కొంది. అందులో 4.5 బిలియన్ డాలర్లు తమకు కేటాయించాలని ఇరాన్ డిమాండ్ చేసినట్లు తెలిపింది. 

చమురు ధరలు, మార్కెట్లపై అనుమానాలు..
అమెరికా-ఇరాన్ ఘర్షణల సమయంలో చమురు ధరలు, ఎనర్జీ కంపెనీల షేర్లు, ఇతర మార్కెట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని సందర్భాల్లో కీలక రాజకీయ ప్రకటనలకు ముందు మార్కెట్లలో అసాధారణ కదలికలు కనిపించాయని విశ్లేషకులు పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది. అయితే ఇవి అంతర్గత సమాచారం ఆధారంగా జరిగిన ట్రేడింగ్ అని నిరూపించే ఆధారాలు లేవని కూడా స్పష్టం చేసింది.

ALSO READ : రెండు భాషలు చాలు.. మూడో భాష ఎందుకు

వైట్‌హౌస్ ఖండన..
ఇరాన్ ఆరోపణలను అమెరికా వైట్‌హౌస్ పూర్తిగా తిరస్కరించింది. జేడీ వాన్స్‌కు అలాంటి సందేశం ఏదీ ఇరాన్ నుంచి అందలేదని, ట్రంప్ బృంద సభ్యులు అధ్యక్షుడి విధానాలను అమలు చేయడం తప్ప మరే ఇతర ఉద్దేశాలతో పనిచేయడం లేదని స్పష్టం చేసింది. విట్‌కాఫ్, కుష్నర్ మాత్రం ఈ ఆరోపణలపై బహిరంగంగా స్పందించలేదు.

వాన్స్‌పై ఇరాన్ నమ్మకం ఎందుకు?
అమెరికా చర్చల బృందంలోని ఇతర సభ్యులతో పోలిస్తే జేడీ వాన్స్ మరింత చర్చలకు అనుకూలంగా ఉంటారని ఇరాన్ భావించినట్లు సమాచారం. అందుకే ఆయనతో ప్రత్యేక సంప్రదింపుల మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. మాజీ అమెరికా ఇరాన్ చర్చల ప్రతినిధి రాబర్ట్ మాలీ కూడా ఇరాన్ నేరుగా వాన్స్‌తో సంబంధాలు ఏర్పరుచుకోవాలనుకోవడం సహజమేనని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా విదేశాంగ విధానాన్ని ఒక్క ఉపాధ్యక్షుడు మాత్రమే నిర్ణయించలేరని అన్నారు. ఇరాన్ ఆరోపణలు నిజమా కాదా అన్నది తేలాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్న అమెరికా-ఇరాన్ దౌత్య సంబంధాల్లో కొత్త రాజకీయ తుఫాన్‌ను రేపాయి.

©️ VIL Media Pvt Ltd.