Reading Time: < 1 minute
Pawan Kalyan Supports Ailing Fan Niranjan Hanamkonda Financial Help

Pawan Kalyan: Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఉదారత్వాన్ని చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండ 4సీ కాలనీలోని తన వీరాభిమాని, నిరంజన్‌ను ప్రత్యేకంగా కలిసి పరామర్శించారు. నిరంజన్ అనారోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ఆ బాలుడిని చూసి చలించిపోయారు. కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని నమ్మకం కలిగిస్తూ, గుండె నిబ్బరంతో ఉండాలని నిరంజన్ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కొండంత మనోధైర్యాన్ని ఇచ్చారు. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు. నిరంజన్ వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అక్కడికక్కడే అందజేశారు. అంతటితో ఆగకుండా, ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆ బాబు తల్లికి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి ఇస్తానని, అలాగే నిరంజన్ సోదరి (పాప) చదువుకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చూపిన ఈ మానవత్వానికి, పెద్ద మనసుకు ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారనే సమాచారంతో హనుమాన్ నగర్ పరిసర ప్రాంతాలకు అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారి నిరంజన్‌ను పరామర్శించిన అనంతరం బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్.. తనను చూసేందుకు వచ్చిన ప్రజలకు, అభిమానులకు ఆత్మీయంగా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ పరామర్శ కార్యక్రమం ముగిసిన వెంటనే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రకాళి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి బయలుదేరి వెళ్లారు.