Reading Time: < 1 minute
Bandi Bhagirath Surrendered Before Police In Pocso Case

తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో పరారీలో ఉన్న నిందితుడు బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం బండి భగీరథ్ న్యాయవాదుల సమక్షంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్లు సమాచారం. ఈ కేసులో హైకోర్టు నుండి ఆయనకు మధ్యంతర బెయిల్ రాకపోవడంతో పాటు, సైబరాబాద్ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లలో ముమ్మరంగా గాలిస్తుండటంతో అరెస్ట్ తప్పదని భావించిన భగీరథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బాధితురాలు ఇచ్చిన రెండవ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఇప్పటికే మొయినాబాద్ ఫామ్‌హౌస్, నానక్‌రామ్‌గూడలోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లలో క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేశారు. భగీరథ్ లొంగిపోవడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రాథమిక ప్రక్రియలను ముగించి, తదుపరి విచారణ నిమిత్తం కేసును విచారిస్తున్న అధికారులకు అప్పగించనున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.