వడదెబ్బకు విరుగుడు: ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ మాలిక్యూల్స్‌లో వచ్చిన పరిశోధన ప్రకారం.. ఎర్ర ఉల్లిపాయలలో ప్రోటీన్లు, ఫినాలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంపై పడే వేడి ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయి. వేసవి భోజనంలో ఉల్లిపాయను భాగం చేసుకోవడం వల్ల శరీర అంతర్గత ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.
జర్నల్ ఆఫ్ ఫుడ్ మెజర్మెంట్ అండ్ క్యారెక్టరైజేషన్ నివేదిక ప్రకారం.. ఉల్లిపాయలో నీటి శాతం అధికం. ఎండలో తిరగడం వల్ల శరీరం కోల్పోయే సహజ లవణాలు, ఎలక్ట్రోలైట్లను ఇది తిరిగి భర్తీ చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ అనే సమ్మేళనం డీహైడ్రేషన్‌ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ద్రవ సమతుల్యతను కాపాడుతూ దాహాన్ని నియంత్రిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ ప్రకారం, పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.
వడదెబ్బ నుంచి ఉపశమనం: వడదెబ్బ తగిలినప్పుడు కలిగే తలనొప్పి, వికారం, వేగవంతమైన హృదయ స్పందన వంటి లక్షణాల తీవ్రతను తగ్గించడంలో ఉల్లిపాయ సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే కేవలం ఉల్లిపాయ మీదనే ఆధారపడకుండా తగినంత నీరు తాగుతూ, ఇతర హైడ్రేషన్ పద్ధతులను కూడా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎవరు జాగ్రత్తగా ఉండాలి: కొందరు ఉల్లిపాయ విషయంలో జాగ్రత్త వహించాలి. తీవ్రమైన ఎసిడిటీ ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తింటే యాసిడ్ స్రవం పెరిగే అవకాశం ఉంది. పేగు సంబంధిత సున్నితత్వం ఉన్నవారు వైద్యుల సలహాతోనే వీటిని తీసుకోవాలి. పాంక్రియాస్ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా వీటి వినియోగంలో నియంత్రణ పాటించాలి.
ఎలా తీసుకుంటే మంచిది?: పెరుగులో ఉల్లిపాయ ముక్కలు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన చల్లదనం లభిస్తుంది. ఇది ప్రోబయోటిక్స్‌ను కూడా అందిస్తుంది. అదేవిధంగా సలాడ్లు, చట్నీలు లేదా నిమ్మరసంలో నానబెట్టిన ఉల్లిపాయ ముక్కలను భోజనంతో పాటు తీసుకోవచ్చు. కాగా వడదెబ్బను ఎదుర్కోవడానికి ఉల్లిపాయ ఒక గొప్ప ఆయుధం. అయితే దీనిని పరిమితంగా, క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మాత్రమే ఫలితం ఉంటుంది.




