July 15, 2026

తెలంగాణ సెక్యూరిటీ అడ్వైజర్గా రిటైర్డ్ డీజీపీ శివధర్ రెడ్డి బాధ్యతలు

తెలంగాణ సెక్యూరిటీ అడ్వైజర్గా రిటైర్డ్ డీజీపీ శివధర్ రెడ్డి బాధ్యతలు
Reading Time: < 1 minute

తెలంగాణ సెక్యూరిటీ అడ్వైజర్గా రిటైర్డ్ డీజీపీ శివధర్ రెడ్డి బాధ్యతలు

Caption of Image.

తెలంగాణ సెక్యూరిటీ అడ్వైజర్(SSA) గా  రిటైర్డ్ డీజీపీ శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2026 మే 06వ తేదీన హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఛార్జ్ తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనను 3 సంవత్సరాల కాలానికి SSAగా నియమించింది.

SSAగా  బాధ్యతలు స్వీకరించిన తరువాత గవర్నర్  శివ ప్రతాప్ శుక్లాను లోక్ భవన్‌లో శివధర్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ CP వి.సి. సజ్జనార్ సహా పలువురు సీనియర్ పోలీస్ అధికారులు ఈ సందర్భంగా శివధర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. హోం డిపార్ట్‌మెంట్, పోలీస్ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డీజీపీగా పదవీ విరమణ చేసిన బి.శివధర్ రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారు (ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పదవిలో ఆయన మూడేండ్లు కొనసాగనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నిరోధం, రోడ్డు భద్రత తదితర కీలకమైన పోలీసింగ్ అంశాలపై ప్రభుత్వానికి ఆయన దిశానిర్దేశం చేస్తారు.

►ALSO READ | కాంగ్రెస్ పార్టీలో పదవుల సందడి : 18 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

ఈ నియామకం ద్వారా శివధర్ రెడ్డికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) హోదాను కల్పించారు. ఆయనకు నెలకు రూ. 2.25 లక్షల గౌరవ వేతనంతో పాటు, నివాస భత్యం కింద మరో రూ.50 వేలు చెల్లించనున్నారు. అదనంగా ఒక ఓఎస్‌‌‌‌డీ, ప్రైవేట్ సెక్రటరీ, పీఏలతో కూడిన ప్రత్యేక సిబ్బందిని అధికారిక వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది.

హోంశాఖ బడ్జెట్ నుంచి ఈ నియామకానికి సంబంధించిన ఖర్చులను భరించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం  చేసింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావును ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు జీవో ఇచ్చింది. ఆయనకు రాష్ట్ర మంత్రి (మినిస్టర్ ఆఫ్ స్టేట్) హోదాను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీహెచ్‌‌‌‌కు నెలకు రూ.లక్ష గౌరవ వేతనంతో పాటు, సొంత కారు వాడితే కన్వేయెన్స్ అలవెన్స్, ఇంధన ఖర్చులు, ప్రతి నెలా రూ. 50 వేల ఇంటి అద్దె భత్యం చెల్లించనుంది.

©️ VIL Media Pvt Ltd.