Reading Time: 2 minutes
ఓరీ దేవుడో.. ఆ సరస్సు నీటిని తాకితే రాయిగా మారిపోతారట! ఆ భయంకర రహస్యం ఏంటంటే..

ప్రపంచంలో ఎన్నో రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో టాంజానియాలోని నట్రాన్ సరస్సు ఒకటి. ఈ సరస్సు నీటిని తాకిన ఏ జీవి అయినా రాయిగా మారిపోతుందని, అక్కడికి వెళ్లడం మృత్యువుతో సమానమని ప్రచారంలో ఉంది. ఈ సరస్సు ఒడ్డున రాయిలా గట్టిపడిపోయిన పక్షుల ఫోటోలు చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టక మానదు. అయితే, దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

న్గోరోంగోరో క్రేటర్‌కు ఈశాన్యంగా నాట్రాన్ సరస్సు ఉంది. నట్రాన్ సరస్సు నీరు సాధారణ నీరు కాదు. దీనిలో సోడియం కార్బోనేట్, మెగ్నీషియం నిక్షేపాలు అత్యధికంగా ఉంటాయి. ఈ సరస్సు సుమారుగా 56 కిలోమీటర్ల పొడవు, 22 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. దీనికి ప్రధానంగా దక్షిణ ఎవాసో న్గిరో నది, ఖనిజాలు సమృద్ధిగా ఉన్న వేడి నీటి బుగ్గల నుండి నీరు అందుతుంది. అయితే, ఈ సరస్సు ప్రాణాంతక ప్రభావాలకు సమీపంలోని ఒక అగ్నిపర్వతమే కారణం. సమీపంలోని ఓల్ డోయిన్యో లెంగాయ్ అనే అగ్నిపర్వతం నుండి వెలువడే బూడిద ఈ సరస్సులో కలవడం వల్ల దీని pH స్థాయి 10.5 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది దాదాపు అమ్మోనియా అంతటి ప్రమాదకరమైన క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది.

ఎందుకు రాయిలా కనిపిస్తాయి?:

ఈ సరస్సులోని నీరు ఎప్పుడూ 60°C వేడితో ఉంటుంది. ఏదైనా పక్షి లేదా జంతువు పొరపాటున ఈ నీటిలో పడితే, ఆ వేడికి, అధిక రసాయనాల ప్రభావానికి అవి తక్షణమే మరణిస్తాయి. నీటిలోని నట్రాన్ (సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్) అనే ఖనిజం చనిపోయిన జీవుల శరీరంలోని ద్రవాలను పీల్చేసి, వాటిని గట్టిగా మార్చేస్తుంది. ఇది ప్రాచీన ఈజిప్షియన్లు మమ్మీలను తయారు చేయడానికి ఉపయోగించే ప్రక్రియను పోలి ఉంటుంది. ఇలా శరీరం కుళ్ళిపోకుండా కాల్షియం పేరుకుపోయి గట్టిపడటం వల్ల అవి రాతి విగ్రహాల్లా కనిపిస్తాయి.

నాట్రాన్ సరస్సు నీరు అంత ప్రమాదకరంగా ఉండటానికి ఒక శాస్త్రీయ కారణం ఉంది. ఓల్డోయిన్యో లెంగాయ్ అగ్నిపర్వతం సోడియం కార్బోనే, కాల్షియం కార్బోనేట్‌ల మిశ్రమాన్ని విడుదల చేస్తుంది. ఈ మిశ్రమం భూగర్భ వేడి నీటి బుగ్గల ద్వారా సరస్సును చేరుతుంది. అంతేకాకుండా, ఈ సరస్సులోని నీరు మరే ఇతర నదిలోకి గానీ, సముద్రంలోకి గానీ ప్రవహించదు. అంతేకాక, వేగంగా ఆవిరైపోవడం వల్ల నదిలోని నీరు ఎండిపోయి, నాట్రాన్ (సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్), ట్రోనా (సోడియం సెస్‌క్వికార్బోనేట్ డైహైడ్రేట్)లను మిగిల్చివేస్తుంది. ఈ కారకాల వల్ల సరస్సులోని pH స్థాయి 10.5కు చేరుతుంది, ఇది దాదాపు అమ్మోనియా అంత క్షార స్వభావం కలిగి ఉంటుంది. అప్పుడప్పుడు, సరస్సులోని pH స్థాయి 12కు కూడా చేరుతుంది. దీనివల్ల జీవుల చర్మం, కళ్ళు కాలిపోవచ్చు.

అంతటి ప్రమాదకరమైన సరస్సులో కూడా లెసర్ ఫ్లెమింగో (Lesser Flamingos) అనే పక్షులు జీవించగలవు. వాటి కాళ్ళ మీద ఉండే గట్టి చర్మం ఈ క్షార నీటి నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ సరస్సు వీటికి ప్రధాన సంతానోత్పత్తి కేంద్రం కూడా. కాబట్టి, ఈ సరస్సు నీటిని తాకగానే ఎవరూ మాయమై రాయిగా మారిపోరు. కానీ, ఆ నీటిలోని అధిక రసాయన స్వభావం ప్రాణవాయువును హరించి, శరీరాలను శిలాజాల్లా (Mummified) మారుస్తుంది. ప్రకృతిలోని వింతల్లో ఇది కూడా ఒకటి!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…