Reading Time: < 1 minute
Heinrich Klaasen Rejects South Africa Comeback Focus On Franchise Cricket Ipl 2026

SRH Batter Klaasen on South Africa Comeback: దక్షిణాఫ్రికా స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. గతేడాది రిటైర్మెంట్ ఇచ్చిన 34 ఏళ్ల క్లాసెన్.. ఫ్రాంఛైజీ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తరపున ఆడుతున్న క్లాసెన్.. పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 157.41 స్ట్రైక్‌రేట్‌తో 414 పరుగులు చేశాడు. ముంబైపై 30 బంతుల్లోనే 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వన్డే వరల్డ్ కప్‌ 2027కు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో మాజీలు, అభిమానులు మరలా సఫారీ జట్టుకు ఆడాలని కోరుతున్నారు. అయితే తాజాగా క్లాసెన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

ఇకపై దక్షిణాఫ్రికా జట్టులోకి తిరిగి రావాలనే ఆలోచన తనకు లేదని హెన్రిచ్ క్లాసెన్ స్పష్టం చేశాడు. అంతేకాకుండా తనకు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి కూడా లేదని వెల్లడించాడు. ‘నేను ఇకపై దక్షిణాఫ్రికా జట్టుకు ఆడే అవకాశం లేదు. నిజం చెప్పాలంటే.. ఆ ఆసక్తి కూడా నాకు లేదు. ఇప్పుడు నా పూర్తి దృష్టి ఫ్రాంచైజీ లీగ్స్‌ పైనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా ముందుకు వచ్చేశాను’ అని క్లాసెన్ స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలతో దక్షిణాఫ్రికా అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇటీవల ఐపీఎల్ సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వివిధ టీ20 లీగ్స్‌లో హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మలుపుతిప్పే సామర్థ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అందుకే ఇప్పుడు అతడు పూర్తిగా ఫ్రాంచైజీ క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా వ్యాపార రంగంపై కూడా దృష్టి పెడుతున్నట్లు క్లాసెన్ వెల్లడించాడు. ‘క్రికెట్‌తో పాటు నా దృష్టి ఇప్పుడు బిజినెస్‌పైన కూడా ఉంది’ అని చెప్పాడు. ఇప్పటికే క్లాసెన్ బిజినెస్‌మ్యాన్‌గా మారాడు. ఫాఫ్‌ డుప్లెసిస్‌, జాంటీ రోడ్స్‌తో కలిసి ఓ క్రికెట్‌ ఫ్రాంచైజీకి ఓనర్ అయ్యాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో రోటర్‌డామ్ ఫ్రాంచైజీని ఈ ముగ్గురు సొంతం చేసుకున్నారు.