
Kitchen Tips: వేసవి వచ్చిందంటే చాలు.. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో పాటు తేమ కూడా ఎక్కువగా ఉండడంతో.. వండిన అన్నం, కూరలు త్వరగా పాడైపోతుంటాయి.. వేడి కారణంగా వంటగదిలో వండిన ఆహారం త్వరగా పాడైపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే పప్పు పదార్థాలు త్వరగా పుల్లగా మారి, నురుగు వచ్చి చెడిపోతాయి. చాలాసార్లు ఉదయం వండిన పప్పు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికే పాడైపోవడం చూస్తుంటాం. అయితే, కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే, వేసవిలో కూడా పప్పును ఎక్కువసేపు తాజాగా ఉంచుకోవచ్చు.
పప్పు ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్‌గా ఉండాలంటే..?
* ముందుగా, వండిన పప్పును ఎక్కువసేపు బయట ఉంచకూడదు. పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత వెంటనే ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. ఎక్కువసేపు బయట ఉంచితే బ్యాక్టీరియా వేగంగా పెరిగి పప్పు త్వరగా పాడవుతుంది. అలాగే పప్పును నిల్వ చేయడానికి శుభ్రమైన, గాలి చొరబడని పాత్రలను ఉపయోగించాలి. దీంతో తేమ, దుమ్ము వంటి మలినాలు లోపలికి చేరకుండా ఉంటుంది.
* పప్పును వండిన వెంటనే వేడిగా ఉన్నపుడు ఫ్రిజ్‌లో పెట్టడం మాత్రం సరైంది కాదు. ముందుగా గది ఉష్ణోగ్రతకు చల్లార్చి, ఆ తర్వాతనే నిల్వ చేయాలి. వేడిగా ఉన్న పదార్థాన్ని నేరుగా ఫ్రిజ్‌లో ఉంచితే ఫ్రిజ్‌లోని ఉష్ణోగ్రతకు అంతరాయం కలిగి, ఇతర ఆహార పదార్థాలపై ప్రభావం చూపుతుంది.
* పప్పును పదేపదే వేడి చేయడం కూడా మంచిది కాదు. అవసరమైనంత మాత్రమే తీసుకుని వేడి చేసుకోవాలి. మిగిలిన పప్పును ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే మళ్లీ వేడి చేస్తే రుచి, నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
* పప్పులో ఉప్పు, మసాలాల మోతాదు కూడా కీలకం. తగినంత ఉప్పు, పసుపు కలపడం వల్ల పప్పు త్వరగా పాడవకుండా ఉంటుంది. పసుపులో ఉన్న యాంటీబాక్టీరియల్ గుణాలు పప్పును కొంతకాలం తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే నిమ్మరసం లేదా చింతపండు వంటి పులుపు పదార్థాలను ముందుగానే కలపకూడదు. ఇవి పప్పును త్వరగా పుల్లగా మారుస్తాయి. కావున తినే ముందు మాత్రమే కలపడం మంచిది.
* పప్పును నిల్వ చేయడానికి సరైన పాత్రను ఎంచుకోవడం కూడా అవసరం. ప్లాస్టిక్ పాత్రల కంటే స్టీల్ లేదా మట్టి పాత్రలు ఉపయోగిస్తే ఉష్ణోగ్రత సరిగ్గా నిల్వ ఉండి పప్పు తాజాగా ఉంటుంది. అలాగే ఫ్రిజ్‌లో ఉంచిన పప్పును కూడా ఎక్కువ రోజులు నిల్వ చేయకుండా 3–5 రోజులలోపు వినియోగించడం ఉత్తమం.
మొత్తంగా ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే, మండే వేసవిలో కూడా పప్పును ఉదయం వండినా రాత్రి వరకు తాజాగా ఉంచుకోవచ్చు.. పప్పు త్వరగా పాడైపోతుంది.. త్వరగా పుల్లగా మారి, నురుగు వచ్చి చెడిపోతుందనే టెన్షన్ ఉండదు..