Reading Time: 2 minutes
Happy Birthday Rohit Sharma Hitman Records Career Stats And Achievements In International Cricket

Happy Birthday Rohit Sharma: భారత క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా పేరు సంపాదించిన రోహిత్ శర్మ ఈరోజు (ఏప్రిల్ 30) తన 39వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. “హిట్‌మ్యాన్”గా ప్రసిద్ధి చెందిన రోహిత్ 2007 జూన్ 23న ఐర్లాండ్‌ లోని బెల్ఫాస్ట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలో అనేక రికార్డులను సృష్టిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

ప్రస్తుతం టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డేల్లో కొనసాగుతూ తన బ్యాటింగ్ పెర్ఫార్మన్స్ ను కొనసాగిస్తున్నారు. 2013లో టెస్ట్ అరంగేట్రం చేసిన రోహిత్, మొత్తం 67 మ్యాచ్‌లు ఆడి 4,301 పరుగులు చేశారు. ఇందులో 12 శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై చేసిన 212 పరుగులు ఆయన టెస్ట్ కెరీర్‌లో అత్యధిక స్కోర్‌. ఇక టీ20 అంతర్జాతీయాల్లో కూడా రోహిత్ తన మార్క్ ప్రదర్శన కనబరిచారు. 2007లో ప్రారంభమైన తన టీ20 కెరీర్‌ లో మొత్తంగా 159 మ్యాచ్‌ లు ఆడి 4,231 పరుగులు చేశారు. టీ20ల్లో అత్యధిక శతకాలు (5) చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సాధించారు. 2007లో ఆటగాడిగా, 2024లో కెప్టెన్‌గా రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలుచుకున్న అరుదైన ఘనత ఆయన సొంతం. 2024లో టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.

వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన ఓపెనర్‌ లలో ఒకడిగా పేరు పొందాడు. 282 మ్యాచ్‌ లలో 11,577 పరుగులు చేసి, 49 సగటుతో అనేక రికార్డులు నమోదు చేశారు. ఇందులో 33 శతకాలు, 61 అర్ధశతకాలు ఉన్నాయి. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (264 పరుగులు) కూడా ఆయన పేరిటే ఉంది. అంతేకాదు.. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచారు.

ఐపీఎల్‌లో కూడా రోహిత్ శర్మ తన ప్రభావాని చూపించారు. టోర్నీ ప్రారంభ 15 సీజన్లలో ఆరు టైటిల్స్ గెలుచుకుని అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు శతకాలు చేయడం, అదే ఏడాది టెస్ట్ ఓపెనర్‌గా మారిన తర్వాత మొదటి సిరీస్‌ లోనే మూడు శతకాలు చేశాడు. కెప్టెన్‌గా కూడా రోహిత్ భారత జట్టును అద్భుతంగా నడిపించారు. 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ కు భారత్‌ను తీసుకెళ్లారు. ఆ టైటిల్స్ చేజారినా, 2024లో టీ20 ప్రపంచకప్ గెలిపించి 13 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు ముగింపు పలికారు. ఆ తర్వాత 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించి తన కెప్టెన్‌గా మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ రోహిత్ శర్మ ఇంకా తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.