
‘సింగ్ గీతం’ చిత్రం తన నలభై ఏళ్ల కల అని.. ఇది విలువైన సినిమాగా నిలుస్తుందని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అన్నారు. ఆయన డైరెక్షన్‌లో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 12న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా సింగీతం శ్రీనివాసరావు చెప్పిన విశేషాలు.
‘‘సుమారు 40 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచనే ఈ చిత్రం. మాటలే పాటలుగా చెప్పే చిత్రాన్ని రూపొందించాలని ఎన్నో ఏళ్లుగా కోరుకున్నా. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు బాగా రావడానికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్. ఈ సినిమా పూర్తి క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. పదేళ్ల తర్వాత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వయసు కారణంగా ఇంటి నుంచే ఆన్‌లైన్ సాంకేతిక సహకారంతో తెరకెక్కించేలా నాగ్ అశ్విన్ ఏర్పాట్లు చేశారు.
నా హోమ్ థియేటర్‌లో కూర్చుని, షూటింగ్ లొకేషన్‌లో జరుగుతున్న ప్రతిదీ ప్రత్యక్షంగా చూస్తూ నటీనటులకు సూచనలు ఇచ్చేవాడిని. అక్కడి కెమెరాలు, మానిటర్లు అన్నీ నాకు కనెక్ట్ అయ్యేవి. ఇంట్లో నుంచే మొత్తం సినిమాను దర్శకత్వం వహించాను. కొత్త ఆలోచనలు, ప్రయోగాలే నా సినీ ప్రయాణానికి మూలం.
‘మాయాబజార్’ రోజుల నుంచే కొత్తదనం కోసం వెతుకుతుండేవాడిని. అదే నన్ను ఇప్పటికీ ముందుకు నడిపిస్తోంది. ఈ సినిమా కూడా జనరేషన్- జెడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించాం. భవిష్యత్తులో ఇది మరింత విలువైన చిత్రంగా గుర్తింపు పొందుతుందని నమ్ముతున్నా’’.