Reading Time: < 1 minute

అమ్మి నిషేధిత జాబితాలో ఎట్లా పెడతరు?..సబ్ స్టేషన్, వాటర్ ట్యాంక్, రోడ్ల అభివృద్ధి ఏది?

Caption of Image.
  • హెచ్ఎండీఏపై ప్లాట్ల కొనుగోలుదారుల ఆగ్రహం
  • మేడిపల్లి ప్రీ బిడ్ ​సమావేశంలో నిరసన 
  • తమ సమస్యలు పరిష్కరించాకే వేలానికి వెళ్లాలని డిమాండ్​

మేడిపల్లి, వెలుగు: హెచ్ఎండీఏపై నమ్మకంతో లక్షలు అప్పు చేసి వేలంలో ప్లాట్లు కొన్నామని, వాటిని నిషేధిత జాబితాలో పెట్టి, మౌలిక వసతులు కల్పించకుండా మళ్లీ వేలం పాటకు ఎలా వస్తారని పలువురు కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 24న మేడిపల్లిలో నిర్వహించనున్న హెచ్ఎండీఏ ప్లాట్ల వేలానికి సంబంధించి సమాచారాన్ని అందించేందుకు మంగళవారం అధికారులు ప్రీబిడ్​ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి 200 మందికి పైగా బిడ్డర్లు పాల్గొన్నారు. 

మేడిపల్లి లే ఔట్​లో 68 పాట్లను వేలం వేయనున్నామని, 231.66 నుంచి 643.22 గజాల సైజుల్లో ప్లాట్లు ఉన్నాయని హెచ్ఎండీఏ డిప్యూటీ కలెక్టర్​ వై. సుదర్శన్, చీఫ్​ప్లానింగ్​ఆఫీసర్​రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మొదటి, రెండో విడతల్లో మేడిపల్లిలోనే ప్లాట్లు కొన్న పలువురు, కాలనీ వేల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపల్లి పద్మారెడ్డితో కలిసి అక్కడికి వచ్చి ప్లకార్డులతో నిరసన తెలిపారు. 

కష్టపడి కొనాలె.. కాళ్లరిగేలా తిరగాలా? 

తాము కష్టపడి కొని..కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలని బాధితులు అధికారులను ప్రశ్నించారు. కొన్న 18 నెలల్లోనే లే అవుట్​లో అన్ని వసతులు కల్పిస్తామన్నారని, ఏమైందని ప్రశ్నించారు. నిషేధిత జాబితాలో చేర్చి తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోయి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఇప్పటికే లే అవుట్​లో 80 ఫీట్ల రోడ్డు మాయమైందని, అది ఎక్కడికి పోయిందని అడిగారు. లే అవుట్​లో సవ్యంగా పనులు జరగడంలేదని, సబ్​స్టేషన్, వాటర్ ట్యాంక్, రోడ్ల అభివృద్ధి జరగడం లేదన్నారు. 

త్వరలో పరిష్కరిస్తాం 

బాధితుల సమస్యలు విన్న హెచ్ఎండీఏ డిప్యూటీ కలెక్టర్ సుదర్శన్ మాట్లాడుతూ ప్లాట్ల కొనుగోలుదారులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయామని, అవి త్వరలో పరిష్కారం అవుతాయన్నారు. కాగా బాధితులు అడ్డుకుంటారని తెలుసుకున్న అధికారులు ముందుగానే పోలీస్ బందోబస్త్ తో వచ్చారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయినా, బాధితులు వినకుండా నిరసన తెలపడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. 

©️ VIL Media Pvt Ltd.