Reading Time: 2 minutes
Iran New 10 Million Rial Banknote Value In Indian Rupees Inflation Crisis

ఇరాన్ దేశం తన చరిత్రలోనే అత్యంత గరిష్ట విలువ కలిగిన ’10 మిలియన్ రియల్’ బ్యాంక్ నోటును తాజాగా చలామణిలోకి తీసుకువచ్చింది. అక్షరాలా కోటి రియల్స్ అన్నమాట. వినడానికి ఇది చాలా పెద్ద మొత్తంగా అనిపించినా.. దీని అసలు విలువ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మన భారతీయ కరెన్సీలో ఈ నోటు విలువ కేవలం రూ. 650 మాత్రమే. అంటే అమెరికా డాలర్లతో పోలిస్తే దీని విలువ కేవలం 7 డాలర్లు మాత్రమే. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎందుకీ పరిస్థితి వచ్చింది..?

ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలతో నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆంక్షలు ఆ దేశ ఆర్థిక వెన్నుముకను విరిచేశాయి. అక్కడ ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ఎంతలా పెరిగిపోయిందంటే.. సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులు కొనాలన్నా సంచుల కొద్దీ నగదును తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇబ్బందులను తగ్గించడానికి, తక్కువ నోట్లతో ఎక్కువ విలువైన లావాదేవీలు జరపడానికి ప్రభుత్వం ఈ 10 మిలియన్ల నోటును ప్రవేశపెట్టింది.

బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న ప్రజలు..

ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఇరాన్ ప్రజలు డిజిటల్ పేమెంట్స్ కంటే చేతిలో నగదు ఉంచుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలు ఎక్కడ ఆగిపోతాయోనని భయపడి, ఏటీఎంల వద్ద గంటల తరబడి వేచి ఉండి తమ పొదుపు మొత్తాన్ని విత్ డ్రా చేసుకుంటున్నారు. నగదుకు డిమాండ్ పెరగడం కూడా ఈ కొత్త నోటు విడుదలకు ఒక కారణం.

ద్రవ్యోల్బణం మిగిల్చిన చేదు నిజం..

కాగితం మీద 10 మిలియన్లు అని కనిపిస్తున్నా.. మార్కెట్లోకి వెళ్తే ఆ నోటుతో వచ్చే వస్తువులు మాత్రం చాలా తక్కువ. సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోయింది. ఒకప్పుడు లక్షల్లో ఉండే వస్తువుల ధరలు ఇప్పుడు కోట్లకు చేరుకున్నాయి. ఇది ఒక కొత్త నోటు విడుదల మాత్రమే కాదు.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి ఒక నిదర్శనం.

అంతర్జాతీయ ఆంక్షలు, ఆర్థిక నిర్వహణలో లోపాలు వెరసి ఇరాన్ కరెన్సీని ప్రపంచంలోనే అత్యంత బలహీనమైనదిగా మార్చేశాయి. కేవలం లావాదేవీల సౌలభ్యం కోసం పెద్ద నోట్లు తేవడం తాత్కాలిక ఉపశమనమే కానీ.. ధరల పెరుగుదలను అరికట్టలేకపోతే ఆ దేశ ఆర్థిక భవిష్యత్తు మరింత అంధకారంలో పడే ప్రమాదం ఉంది.