July 13, 2026

New Airports: ప్రతీ 45 రోజులకు ఒక విమానాశ్రయం ప్రారంభం.. మంత్రి వెల్లడి..

New Airports: ప్రతీ 45 రోజులకు ఒక విమానాశ్రయం ప్రారంభం.. మంత్రి వెల్లడి..
Reading Time: < 1 minute
We Are Inaugurating An Airport Every 45 Days Says Minister Rammohan Naidu

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన , వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా అవతరించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశీయ విమానయాన రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను వివరించారు. ముఖ్యంగా సామాన్యుడికి కూడా విమాన ప్రయాణాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

Also Read:VI And BSNL: ఒకే గొడుగు కిందకు వొడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్..

గడిచిన కొన్నేళ్లలో విమానాశ్రయాల సంఖ్య అసాధారణంగా పెరిగింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి తక్కువగా ఉన్న విమానాశ్రయాల సంఖ్య.. ప్రస్తుతం 167కు చేరుకోవడం విశేషం. ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ‘ఉడాన్’ (UDAN) పథకం ద్వారా టైర్-2, టైర్-3 నగరాలకు కూడా విమాన సర్వీసులు విస్తరించాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యం లభిస్తోంది.

భారత్‌లోనే విమానాల తయారీ జరిగితే డొమెస్టిక్ సర్వీసుల ఛార్జీలు మరింత తగ్గే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. దీనివల్ల విదేశీ కంపెనీలపై ఆధారపడటం తగ్గి, దేశీయంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విమాన ప్రయాణం విలాసం కాదు, అది ఒక అవసరమని భావిస్తూ మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే విధంగా విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది విశాఖపట్నంపై ఒత్తిడిని తగ్గించి, అంతర్జాతీయ కనెక్టివిటీని పెంచుతుంది. నెల్లూరు జిల్లా దగదర్తితో పాటు, కుప్పంలో కూడా కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి మరిన్ని నగరాలకు సర్వీసులను పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణలో వరంగల్ (మామునూరు), నిజామాబాద్ (జక్రాన్‌పల్లి), ఆదిలాబాద్‌లలో పాత విమానశ్రయాలను పునరుద్ధరించి, పౌర విమానయానానికి సిద్ధం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. వీటితో పాటు కొత్తగూడెంలో కూడా కొత్త ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.