July 12, 2026

Couvade syndrome: మగాళ్లకు కూడా గర్భం.. సైంటిస్టులు తేల్చిన సంచలన నిజం!

Couvade syndrome: మగాళ్లకు కూడా గర్భం.. సైంటిస్టులు తేల్చిన సంచలన నిజం!
Reading Time: 2 minutes
Couvade Syndrome Explained Why Men Experience Pregnancy Symptoms

ఒక ఇంట్లో భార్య గర్భవతి అయితే అదే సమయంలో భర్తకు కూడా వాంతులు, అలసట, బరువు పెరగడం లాంటి లక్షణాలను మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు రికార్డవుతున్నాయంటే నమ్మగలరా? శాస్త్రవేత్తలు కూడా దీనిపై సీరియస్‌గా అధ్యయనం చేస్తున్నారు. ఇంతకీ శరీరంలో మార్పులు లేకుండా ఈ తరహా లక్షణాలు ఎలా వస్తాయి? మనసు శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇంతకీ పురుషులకు ఎదురయ్యే ఈ ‘కౌవేడ్ సిండ్రోమ్’ వెనుక అసలు రహస్యం ఏంటి?

కౌవేడ్ సిండ్రోమ్ అనే పదం ఫ్రెంచ్ భాషలోని కౌవర్‌ అనే పదం నుంచి వచ్చింది. దానికి అర్థం ‘పొదగడం’ లేదా ‘ఇంక్యుబేట్ చేయడం’. సాధారణంగా గర్భధారణకు సంబంధం లేకపోయినా, గర్భవతి భాగస్వామి కూడా అదే తరహా లక్షణాలను అనుభవించే పరిస్థితిని ఈ పేరుతో పిలుస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 20 శాతం తండ్రుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వాంతులు, అసహనం, బరువు పెరగడం, ఆకలి మార్పులు, నిద్రలేమి, మూడ్ స్వింగ్స్, వెన్నునొప్పి లాంటి అనేక లక్షణాలు మగాడిలో కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలు గర్భిణి మహిళల లాగానే మొదటి మూడు నెలల్లో ప్రారంభమై, ప్రసవ సమయానికి గరిష్ట స్థాయికి చేరుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది ఎందుకు జరుగుతుందన్న ప్రశ్నకు రెండు సమాధానాలు కనిపిస్తున్నాయి. మొదటిది సైకాలజికల్ ఎక్స్‌ప్లనేషన్. పురుషుడు తన భాగస్వామితో గాఢంగా భావోద్వేగంగా రిలేషన్‌లో ఉండడం వల్ల ఈ లక్షణాలు వస్తాయట. అంటే ఇది ఒకరకంగా ఎంపతికి సంబంధించిన అంశం.

ఇక రెండోది బయోలాజికల్ కోణం. కొన్ని అధ్యయనాలు ఈ తరహా తండ్రులలో హార్మోన్ల మార్పులను గుర్తించాయి. ప్రోలాక్టిన్ అనే హార్మోన్ స్థాయిలు పెరగడం, టెస్టోస్టెరోన్ స్థాయిలు తగ్గడం, కార్టిసాల్ మార్పులు జరగడం లాంటి విషయాలను గుర్తించారు. ఇవి గర్భిణిల హార్మోన్ల మార్పులతో పోలిక చూపిస్తున్నాయి.

కొన్ని పరిశోధనలు ఈ ఫినామెనాను పరిణామక్రమ దృష్టితో కూడా చూస్తున్నాయి. పురుషుడు తన భాగస్వామి, పుట్టబోయే శిశువుతో బంధాన్ని బలపరచుకోవడానికి శరీరం స్వయంగా సర్దుబాటు అవుతుందనే అభిప్రాయం కూడా ఉంది. అంటే ఇది ఒకరకంగా పేరెంటల్ బాండింగ్ మెకానిజం కావచ్చని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే అన్ని పరిశోధనలు ఒకే విధంగా చెప్పడం లేదు. కొంతమంది వైద్య నిపుణులు దీన్ని పూర్తిగా మానసిక ప్రతిస్పందనగా మాత్రమే చూస్తున్నారు. క్లినికల్‌గా స్పష్టమైన నిర్ధారణ లేకపోవడం, ప్రతి వ్యక్తిలో లక్షణాలు ఒకే విధంగా కనిపించకపోవడం వల్ల దీన్ని రుగ్మతగా గుర్తించలేదు.

ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనసు, శరీరం మధ్య ఉన్న సంబంధం ఎంత లోతుగా ఉంటుందో ఇది చూపిస్తోంది. శరీరంలో గర్భం లేకపోయినా, మనసు అనుభవించే భావోద్వేగాలు శారీరక లక్షణాలుగా మారే స్థాయికి వెళ్లడం ఒక ఆశ్చర్యకరమైన ప్రక్రియే కదా!