Reading Time: 2 minutes
Chris Gayle Ipl Record Can Rohit Sharma Virat Kohli Or Ms Dhoni Break Sixes Record

Most Sixes in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే.. భారీ షాట్లు, కళ్లుచెదిరే సిక్సర్లు. సంవత్సరాలుగా ఎందరో పవర్ హిట్టర్లు తమ బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తున్నారు. బంతిని సులభంగా స్టేడియంలోకి పంపే సామర్థ్యం ఉన్న ప్లేయర్స్ చేలా మందే ఉన్నారు. అయితే అందులో అద్భుత సిక్సులు బాదుతూ క్రికెట్ అభిమానులకు మరపురాని క్షణాలను అందించిన వారు కొందరే ఉన్నారు. ఐపీఎల్ 2026 ఆరంభం నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ తన ఐపీఎల్ కెరీర్‌లో 141 ఇన్నింగ్స్‌లలోనే 357 సిక్సర్లు బాదాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన గేల్.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన టీ20 బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. గేల్ పేరిట ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు, ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డులు కూడా ఉన్నాయి. 2013 సీజన్‌లో 59 సిక్సర్లు బాది ఈ ఘనత సాధించాడు. అదే సీజన్‌లో పుణే వారియర్స్‌పై ఆడిన 175 నాటౌట్ పరుగుల ఇన్నింగ్స్‌లో 17 సిక్సర్లు బాదడం ద్వారా మరో చరిత్ర సృష్టించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గేల్ సిక్సర్ల వర్షం కురిపించగా.. ఆ మైదానంలో 120కి పైగా సిక్సర్లు బాదాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. 256 ఇన్నింగ్స్‌లో 302 సిక్సర్లు బాదాడు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 291 సిక్సర్లతో (248 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఫినిషింగ్ స్టైల్‌తో 264 సిక్సర్లు (234 ఇన్నింగ్స్‌లు) బాదగా.. దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ 251 సిక్సర్లతో (170 ఇన్నింగ్స్‌లు) ఐదో స్థానంలో నిలిచాడు. వీరి ఆట శైలి ఐపీఎల్‌కు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. డేవిడ్ వార్నర్ (236), కిరోన్ పొలార్డ్ (223), సంజు శాంసన్ (216), ఆండ్రీ రస్సెల్ (210), సురేష్ రైనా (203) వంటి స్టార్ ఆటగాళ్లు టాప్ 10లో ఉన్నారు.

Also Read: Iftar Dinner: నేడు ముస్లిం సోదరులకు వైసీపీ ఇఫ్తార్ విందు.. పాల్గొననున్న మాజీ సీఎం వైఎస్ జగన్!

ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు క్రిస్ గేల్ రికార్డుకు కాస్త దగ్గరగా ఉన్నారు. రోహిత్ ఇప్పటికే 300కు పైగా సిక్సర్లు సాధించగా.. కోహ్లీ కూడా అతనికి సమీపంలోనే ఉన్నాడు. రాబోయే ఐపీఎల్ సీజన్లలో వీరు తమ సిక్సర్ల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. అయితే మరో 2-3 ఏళ్లు అడ్డునున్న రో-కోలు గేల్ రికార్డును బ్రేక్ చేయడం కష్టమే అని చెప్పాలి. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్‌లో పవర్ హిట్టింగ్ ఎంత కీలకమో అర్థమవుతోంది. రాబోయే సీజన్లలో ఈ రికార్డులు మారుతాయా?, కొత్త ఆటగాళ్లు ఈ జాబితాలోకి వస్తారా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.