Reading Time: < 1 minute
Mbs Urges Trump Strike Iran Nyt Report Middle East War 2026

Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా సాగిస్తున్న యుద్ధం మూడో వారంలోకి ఎంటరైంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై మరింతగా దాడులు చేయాలని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ డోనాల్డ్ ట్రంప్‌ను ప్రైవేట్‌గా కోరినట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది. ఈ యుద్ధం నేపథ్యంలో ట్రంప్‌తో సౌదీ క్రౌన్ ప్రిన్స్ నిరంతరం టచ్‌లో ఉన్నట్లు కథనం పేర్కొంది. ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా వ్యాపించడంతో, ఇరాన్‌ను మరింత గట్టిగా కొట్టాలని ట్రంప్‌ను కోరినట్లు చెప్పింది.

ఇరాన్ యుద్ధం నేపద్యంలో ట్రంప్ అనేక మంది అరబ్ నాయకులతో మాట్లాడుతున్నారని, సౌదీ క్రౌన్ ప్రిన్స్ ట్రంప్‌ను గట్టిగా సమర్థించే వారిలో ఒకరని వైట్ హౌజ్ ప్రతినిధులు చెబుతున్నారు. టెహ్రాన్‌పై సౌదీ వైఖరి చాలా ఏళ్లుగా కొనసాగుతోందని, గతంలో దివంగత రాజు అబ్దుల్లా కూడా ఇరాన్‌పై దాడి చేయాలని అమెరికాను పదే పదే కోరినట్లు కథనం పేర్కొంది. సౌదీ అరేబియా, ఇరాన్‌ను తమ ప్రధాన ప్రత్యర్థిగా చూస్తోంది. మధ్యప్రాచ్యం అంతటా రాజకీయ ప్రభావం, సైనిక శక్తి, మతపరమైన విభజన సౌదీ-ఇరాన్ మధ్య పోటీకి దారి తీసింది.

Read Also: Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్‌లు ఇరాన్‌పై దాడులు చేశాయి. దాడులు జరిగిన మొదటి రోజు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఇరాన్ టాప్ మిలిటరీ, పాలనాధికారులు మరణించారు. అప్పటి నుంచి ఇరాన్ కూడా ప్రతీకార దాడలకు పాల్పడుతోంది. ఇజ్రాయిల్‌తో పాటు గల్ఫ్ లోని యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైయిన్, కువైట్, ఖతార్ దేశాలపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ఈ దేశాల్లో ఉన్న యూఎస్ మిలిటరీ స్థావరాలపై, ఇంధన సౌకర్యాలపై దాడులు చేస్తోంది. ఇదే కాకుండా చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. దీంతో ప్రపంచ ఇంధన భద్రత ప్రమాదంలో పడింది.