July 11, 2026

Induction safety: ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా.. చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే..

Induction safety: ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా.. చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే..
Reading Time: 2 minutes
Induction Cooktop Safety 5 Must Do Tips And 5 Mistakes To Avoid For Safer Cooking

Induction safety:మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం భారత్‌లో ఎల్పీజీ సంక్షోభానికి కారణమైంది. ఇరాన్ కీలకమైన ‘హర్ముజ్’ జలసంధిని మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, ఎల్జీపీకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు, గ్యాస్ భయాల వల్ల ప్రస్తుతం ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్ పెరిగింది. గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయంతో చాలా మంది ఇండక్షన్ కుక్‌‌టాప్ కొనుగోలు చేస్తున్నారు. దుకాణాల్లో, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లకు మస్త్ డిమాండ్ ఏర్పడింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా వంట పాత్రల్ని నేరుగా వేడి చేయడానికి ఇండక్షన్ కుక్‌టాప్‌లు పనిచేస్తాయి. దీని వల్ల వంట వేగంగా పూర్తవుతుంది. వేడి నియంత్రణ కూడా చాలా సులభంగా చేయవచ్చు. అయితే, వీటి సరిగా ఉపయోగించడం రావాలి. సరిగా వాడకుంటే ఓవర్ హీటింగ్, గ్లాస్ సర్ఫేస్ డ్యామేజ్, ఎలక్ట్రిక్ సమస్యలు, చివరకు అగ్నిప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీంతో వీటిని ఉపయోగించే సమయంలో ఈ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

ఇండక్షన్ స్టవ్‌లు వాడేటప్పుడు ఈ పనుల్ని తప్పక చేయాలి.

* సరైన పాత్రల ఎంపిక:
ఇండక్షన్ కుక్‌టాప్‌కు ఫెరోమాగ్నెటిక్ మెటల్ ఉన్న పాత్రలు అవసరం. కాస్ట్ ఐరన్, మాగ్నెటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు మాత్రమే వంట చేయడానికి ఉపయోగపడుతాయి. పాత్రల్ని టెస్ట్ చేయడానికి అయస్కాంతం పాత్ర అడుగున ఉంచండి, బలంగా అంటుకుంటే అది ఇండక్షన్‌పై పనిచేస్తుంది.

* మధ్యలో ఉంచి వంట చేయాలి:
కుక్‌టాప్ ఆన్ చేసే ముందు వంట పాత్రను హీటింగ్ జోన్ మధ్యలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల వేడి సమంగా అందుతుంది. త్వరగా వంట పూర్తవుతుంది. స్టవ్ హీటింగ్ జోన్‌లో కాకుండా మధ్యలో ఉంచితే, వంటకు సమయం పట్టడంతో పాటు కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంది.

* సరైన పరిమాణం ఉండే వంట పాత్రలు వాడాలి:
పాత్ర అడుగు భాగం ఇండక్షన్ స్టవ్ పై ఉన్న హీటింగ్ సర్కిల్‌కు సరిపోవాలి. పాత్ర పరిమాణ సర్కిల్ సైజ్ కన్నా పెద్దగా ఉన్నా, చిన్నగా ఉన్నవి వాడితే పనితీరు తగ్గుతుంది. కుక్‌టాప్ చుట్టూ కనీసం 10 సెం.మీ. ఖాళీ స్థలం ఉండాలి. స్టవ్ లోపల ఉన్న కూలింగ్ ఫ్యాన్ సరిగా పనిచేయడానికి ఇది అవసరం. వంట పూర్తయ్యాక హీట్ ఇండికేటర్ ఆఫ్ అయిన తర్వాత గ్లాస్ సర్ఫేస్‌ను సాఫ్ట్ క్లాత్‌తో శుభ్రం చేయాలి. పాత్ర అడుగు భాగం మరియు కుక్‌టాప్ సర్ఫేస్ డ్రైగా ఉండాలి.

ఈ పొరపాట్లు అసలే చేయవద్దు..

* సరిపోని పాత్రలు వాడడం:
అల్యూమినియం, కాపర్, గాజు లేదా సిరామిక్ పాత్రలు మాగ్నెటిక్ బేస్ లేకపోతే ఇండక్షన్‌పై పనిచేయవు. వీటిని వాడకూదడు. అయస్కాంతాలను ఆకర్షించే వంట పాత్రలను వాడితేనే ఇండక్షన్ స్టౌవ్ పనిచేస్తుంది.

*మెటల్ వస్తువులు పైన పెట్టడం:
స్పూన్లు, ఫోర్కులు, కత్తులు, అల్యూమినియం ఫాయిల్ వంటి వాటిని కుక్‌టాప్‌పై ఉంచకూడదు. ఇవి వేడి అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రమాదవశాత్తు వీటిని పెట్టి స్టవ్ ఆన్ చేస్తే అవి వేడయ్యే ప్రమాదం ఉంటుంది.

* పాత్రలను లాగుతూ కదిలించడం:
గ్లాస్ సర్ఫేస్‌పై పాత్రలను లాగితే స్క్రాచ్‌లు ఏర్పడవచ్చు. గ్లాస్ సర్ఫేస్ శుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. హీటింగ్ సర్కిల్ కాకుండా వేరే ప్రాంతాల్లో పాత్రల్ని ఉంచకూడదు.

* వెంటిలేషన్ రంధ్రాలు మూసేయడం:
ఇండక్షన్ కుక్‌టాప్ దిగువ భాగం లేదా వెనుక భాగంలో ఉన్న ఎయిర్ వెంట్స్ మూసేయకూడదు. అలా చేస్తే ఓవర్ హీటింగ్ అవుతుంది. దీని వల్ల ప్రమాదం ఏర్పడవచ్చు.