Reading Time: 2 minutes
Eci Transfers West Bengal Dgp Chief Secretary Before Elections 2026

Bengal Elections: కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కార్‌కు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు బెంగాల్ పోలీస్, బ్యూరోక్రసీలో కీలక అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసింది. ప్రస్తుతం డీజీపీ, ప్రధాన కార్యదర్శులను తొలగించి, ఆ పదవుల్లో కొత్త అధికారులను నియమించింది. సీనియర్ IAS అధికారి దుష్యంత్ నారియాలా, నందిని చక్రవర్తి స్థానంలో ప్రధాన కార్యదర్శిగా నియమితులవుతారు. పీయూష్ పాండే స్థానంలో ఉన్నత పోలీసు అధికారి సిద్ధ్ నాథ్ గుప్తా డీజీపీగా నియమితులయ్యారు. కోల్‌కతా పోలీసు కమిషనర్‌తో సహా మరో ముగ్గురు సీనియర్ అధికారులను కూడా ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఒక రోజు తర్వాత, ఎన్నికల సంఘం బెంగాల్‌లో కీలక అధికారులను బదిలీ చేసింది. 1992 బ్యాచ్ IPS అధికారి సిద్ధ్ నాథ్ గుప్తాను పశ్చిమ బెంగాల్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ జనరల్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DG & IGP)గా నియమించారు. గుప్తా 30 ఏళ్ల కెరీర్‌లో కీలక స్థానాల్లో విధులు నిర్వహించారు. నందిగ్రామ్ అల్లర్లు, లాల్‌గఢ్ నక్సల్స్ ఉద్యమం, డార్జిలింగ్ గోర్ఖాలాండ్ ఆందోళలన సమయంలో ఆయన శాంతిభద్రతల్ని సమర్థవంతంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మతపరమైన అల్లర్లను అదుపు చేయడంతో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది.

Read Also: Governor Shiv Pratap Shukla: రైతు భరోసా నుంచి మహాలక్ష్మి వరకు.. సంక్షేమ పథకాలపై గవర్నర్ మార్క్ ప్రసంగం..!

మరోవైపు, సీనియర్ అధికారి అజయ్ కుమార్ నంద్, సుప్రతీమ్ సర్కార్ స్థానంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అజయ్ ముకుంద్ రనడే అదనపు డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శాంతిభద్రతలు) గా నియమితులయ్యారు. బదిలీ అయిన అధికారుల్ని పూర్తిగా ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి ఎన్నికల విధుల్లో నియమించొద్దని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని, సంబంధిత అధికారులు మధ్యాహ్నం 3 గంటల లోపు బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పోలీస్ అధికారులతో పాటు సీఎస్ నందిని చక్రవర్తి స్థానంలో దుష్యంత్ నరియాలా కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చక్రవర్తిని ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధుల్లో ఉంచొద్దని ఆదేశించింది. సంఘమిత్ర ఘోష్‌ను హోం అండ్ హిల్ అఫైర్స్ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించిన తర్వాతే, ఈ ఇద్దరు అధికారులను బాధ్యతల నుండి తప్పించే నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.