Reading Time: < 1 minute
Bjp Tvk Alliance Rumors Vijay Deputy Cm Offer Tamil Nadu Elections

BJP-TVK Alliance: ఆదివారం రోజు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం (ఈసీ) ఈ రోజు(ఆదివారం) షెడ్యూల్ ప్రకటించనుంది. ముఖ్యంగా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే, షెడ్యూల్ ప్రకటనకు కొన్ని గంటల ముందు తమిళనాడు వ్యాప్తంగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి విజయ్ పార్టీ అయిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) చేరుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ మేరకు విజయ్, బీజేపీ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ వర్గాల ప్రకారం.. ఒక వేళ కూటమి ఎన్నికల్లో గెలిస్తే విజయ్‌కు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెడుతామని బీజేపీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సీట్ల ఒప్పందంలో భాగంగా విజయ్ పార్టీకి సుమారు 80 అసెంట్లీ సీట్లను బీజేపీ ఆఫర్ చేసినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

Read Also: Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

ఒక వేళ ఈ చర్చలు విజయవంతమై, పొత్తు కార్యరూపం దాలిస్తే తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. తమిళనాడులో అధికార, ప్రతిపక్షాల విజయావకాశాలు కొద్ది పాటి ఓట్ల శాతంతో మారిపోతుంటాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో విజయ్ ఫ్యాక్టర్ కీలకం కాబోతోంది. అయితే, టీవీకే వర్గాలు మాత్రం విజయ్ ముఖ్యమంత్రి పదవిపైనే దృష్టి సారించినట్లు చెబుతున్నాయి. ఈ అంశమే ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభనకు దారి తీస్తోందని తెలుస్తోంది.

నటుడు-రాజకీయ నాయకుడు విజయ్‌ను ఎన్డీయేలోకి తీసుకురావడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు, కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ ఈ రోజు ఢిల్లీలో సీబీఐ ముందు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో పొత్తుపై ఈ లీకులు రావడం రాజకీయాలను ఆసక్తికరంగా మార్చాయి. తమిళనాట విజయ్ పార్టీ అతి తక్కువ కాలంలోనే ప్రజాదృష్టిని ఆకర్షించింది. దీంతో విజయ్‌ను తమ కూటమిలోకి తీసుకురావడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అనేక మార్గాలను అన్వేషిస్తోంది.