Reading Time: < 1 minute
Telangana Power Demand All Time Record 2026

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం సరికొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక విద్యుత్ సరఫరా చేసి విద్యుత్ సంస్థలు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. మార్చి 13, 2026న తెలంగాణలో విద్యుత్ వినియోగం ఆల్‌ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. పెరిగిన ఉష్ణోగ్రతలు , వ్యవసాయ అవసరాల నేపథ్యంలో ఏర్పడిన భారీ డిమాండ్‌ను రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ విజయవంతంగా తట్టుకుని నిరంతరాయంగా సరఫరాను కొనసాగించింది.

Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..! బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి..?

మార్చి 13వ తేదీన ఒక్క రోజునే రాష్ట్రవ్యాప్తంగా 341.08 మిలియన్ యూనిట్ల (MU) విద్యుత్తును సరఫరా చేయడం గమనార్హం. ఇది గత ఏడాది మార్చి 18న నమోదైన 335.19 మిలియన్ యూనిట్ల రికార్డును అధిగమించింది. అదే రోజు ఉదయం 11:17 గంటలకు రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 18,228 మెగావాట్లకు చేరుకుంది. గతంలో నమోదైన గరిష్ట డిమాండ్ (17,162 మెగావాట్లు) కంటే ఇది చాలా ఎక్కువ. ఇంతటి భారీ లోడ్‌ను ఏమాత్రం అంతరాయం కలగకుండా నిర్వహించడం ద్వారా తెలంగాణ విద్యుత్ వ్యవస్థ తన సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది.

రాష్ట్రంలో ఎండలు ముదురుతుండటం, పంట పొలాలకు నీటి సరఫరా కోసం వ్యవసాయ మోటార్ల వాడకం పెరగడం వల్లే ఈ స్థాయిలో డిమాండ్ పెరిగినట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే, భవిష్యత్తులో ఏర్పడే మరిన్ని అవసరాలను తీర్చేందుకు కూడా విద్యుత్ శాఖ పూర్తి సన్నద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో రోజుకు 350 మిలియన్ యూనిట్ల పైగా విద్యుత్ వినియోగం పెరిగినా, లేదా గరిష్ట లోడ్ 19,000 మెగావాట్లకు చేరుకున్నా తట్టుకునేలా గ్రిడ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Durandhar 2 : మరీ ఇంత ధైర్యమా ఆదిత్య ధర్?

ఈ అసాధారణ విజయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. అత్యధిక డిమాండ్ ఉన్న సమయంలోనూ అప్రమత్తంగా ఉండి, నిరంతర విద్యుత్ సరఫరాను అందించిన విద్యుత్ సంస్థల అధికారులు , సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. బలమైన గ్రిడ్ , పక్కా కార్యాచరణ ప్రణాళికతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.