Reading Time: < 1 minute
Cm Revanth Reddy Reviews Sports Department Young India Sports University Plan

CM Revanth Reddy: ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు చేయూత నివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం క్రీడాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో అన్ని సౌకర్యాలతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని సూచించారు. గచ్చిబౌలి ఔట్ డోర్ స్టేడియంను పునరుద్ధరించడం తోపాటు, స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు. డిజైన్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఒలంపిక్స్, కామన్ వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా, ఒలంపిక్స్ లో తెలంగాణ క్రీడాకారుల సత్తా చాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంలను భవిష్యత్ అవసరాలు, శిక్షణ, పోటీలకు అనుగుణంగా ఆధునీకీకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, SAT చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీనివాస రాజు, శేషాద్రి, SAT ఎండీ సోనీ బాలదేవి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి. కిషోర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

READ MORE: IP54 రేటింగ్‌, 8.2mm మందంతో మార్చి 17న ‘Samsung Galaxy M17e 5G’ లాంచ్..!