July 10, 2026

Women’s Day 2026:జగతికి జీవం పోసిన జోలపాటకు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!

Women’s Day 2026:జగతికి జీవం పోసిన జోలపాటకు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
Reading Time: < 1 minute
International Womens Day 2026 Special Article Tribute To Womanhood

ఈ రోజు మార్చి 8. లోకమంతా మహిళల గొప్పతనం గురించి మాట్లాడుకునే రోజు. కానీ నిజానికి ఒక స్త్రీ విలువను కొలవడానికి ఈ ఒక్క రోజు సరిపోతుందా? త్యాగానికి మరో రూపం స్త్రీ అని అంటాం, కానీ ఆ త్యాగం వెనుక ఆమె ఎంతటి మౌన పోరాటాన్ని దాచుకుంటుందో మనమెప్పుడైనా గమనించామా? ఉదయం అందరికంటే ముందు నిద్రలేచి, రాత్రి అందరూ పడుకున్నాక విశ్రమించే ఒక “అమ్మ”లో ఎన్ని అలసటలు ఉన్నాయో ఆమె ఎప్పుడూ చెప్పదు. తన ఆశలను, కలలను మూటగట్టి అటక మీద పడేసి, పిల్లల భవిష్యత్తు కోసం, భర్త సంతోషం కోసం చిరునవ్వుతో బ్రతికేస్తుంటుంది. మండుతున్న ఎండలో చెమట చిందుస్తూ ఇంటిని చల్లబరిచే చలువ పందిరి ఆమె.

ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి అడుగడుగునా ఆంక్షల మధ్య ఎదుగుతూ, పెళ్లయ్యాక కన్నవారిని వదిలి పరాయి ఇంటికి వెళ్ళి, అక్కడ అందరినీ తనవారిగా చేసుకునే గుండె ధైర్యం ఒక్క స్త్రీకే సాధ్యం. ఆమె కంట్లో నీరు వస్తే ఆ ఇల్లు అరిష్టమని అంటారు, కానీ ఆ కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను మాత్రం మర్చిపోతుంటారు. చదువులో, ఉద్యోగంలో, అంతరిక్షంలో.. నేడు మహిళలు ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. అయినా సరే, ఇంటికి రాగానే మళ్ళీ అదే పాత గరిటె పట్టుకుని మన ఆకలి తీరుస్తారు. ఆమె ఓర్పు భూమి కంటే గొప్పది, ఆమె ప్రేమ ఆకాశం కంటే విశాలమైనది.

నిజమైన మహిళా దినోత్సవం అంటే కేవలం వాట్సాప్ స్టేటస్‌లు పెట్టడం కాదు.. ఆమెను ఒక మనిషిగా గుర్తించడం, ఆమె కష్టాన్ని గౌరవించడం. రాత్రి పూట ఒంటరిగా బయటకు వెళ్లినా భయం లేని లోకాన్ని ఆమెకు బహుమతిగా ఇవ్వడం. అమ్మా, నువ్వు లేకపోతే ఈ సృష్టికి అర్థమే లేదు. నీ కంటిపాపలో ఒక్క కన్నీటి చుక్క కూడా చేరకుండా చూసుకోవడమే మేము నీకు ఇచ్చే నిజమైన గౌరవం. నువ్వు పడుతున్న ప్రతి కష్టానికి, కురిపిస్తున్న ప్రతి ప్రేమామృతానికి ఈ ప్రపంచం నీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది.