Reading Time: 2 minutes
Summer Family Vacations Best Summer Tourist Spots For Families In India Araku Coorg Manali Munnar Rameshwaram

Summer Family Vacations: వేసవి తాపం మెల్లగా తన ప్రతాపాన్నిచూపించడం మొదలుపెట్టింది. ఉదయం సూర్యుడు కొంచెం త్వరగా నిద్రలేస్తున్నాడు. మధ్యాహ్నం గాలిలో బాగా వేడిని పెంచుతున్నాడు. మరోవైపు పిల్లల పరీక్షలు ముగియబోతున్న సమయంలో ప్రతి ఇంట్లో ఒక చిన్న చర్చ మొదలవుతుంది. ఈసారి ఎక్కడికైనా వెళ్లాలా? పిల్లలతో కలిసి ప్రకృతి మధ్యలో కొంత సమయం గడపాలా? కొండల చల్లని గాలిని ఆస్వాదించాలా? సముద్రం అలల శబ్దం వింటూ ప్రశాంతంగా నడవాలా అని చాలా కుటుంబాలు ఆలోచిస్తున్నాయి. అలాంటి ఆలోచనల మధ్య మనకు దగ్గరగా ఉండే అందమైన ప్రదేశాలు కూడా మనల్ని ఆహ్వానిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉండి, ప్రయాణం చాలా కష్టంగా కాకుండా, కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపడానికి ఎంతో అనువైన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Earthquake: ఇజ్రాయెల్ దాడుల ఎఫెక్ట్.. ఇరాన్‌లో భూకంపం.. 4.1గా నమోదు

అరకు:
ఏపీలో టూరిస్ట్ స్పాట్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది అరకు లోయ. విశాఖపట్నం నుంచి కొండల మధ్యుగా వెళ్లే ఆ రైలు ప్రయాణం ఒక ప్రత్యేక అనుభూతి. సొరంగాలు దాటుతూ, పచ్చని కొండల మధ్య రైలు నడుస్తుంటే మనసే ప్రకృతితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అరకులో గాలిలోనే చల్లదనం ఉంటుంది. కాఫీ తోటలు, ట్రైబల్ మ్యూజియం, బొర్రా గుహలు అన్నీ కలిసి ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేక అందాన్ని ఇస్తాయి. విశాఖపట్నం వరకు రైలు లేదా విమానం ద్వారా చేరుకుని అక్కడి నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో అరకూ చేరుకోవచ్చు.

కూర్గ్:
తెలుగు ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండి ప్రకృతి ఒడిలో విశ్రాంతి ఇవ్వగల మరో ప్రదేశం కూర్గ్. కర్ణాటకలోని ఈ చిన్న కొండ ప్రాంతం కాఫీ తోటల పరిమళంతో నిండిపోయి ఉంటుంది. ఉదయం మంచు పొగమంచులో కొండలు నిద్రలేచినట్టు కనిపిస్తాయి. అబ్బే ఫాల్స్ జలపాతం అక్కడికి వెళ్లిన ప్రతి ప్రయాణికుడిని మంత్రముగ్ధులను చేస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు రైలు లేదా విమానం ద్వారా చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కూర్గ్ చేరుకోవచ్చు.

మనాలి:
వేసవి వేడి నుంచి నిజంగా తప్పించుకోవాలని అనిపిస్తే హిమాచల్ ప్రదేశ్‌ లోని మనాలి కూడా ఒక అద్భుతమైన ఎంపిక. మంచు కొండల మధ్య నడుస్తున్నట్టు అనిపించే ఆ ప్రాంతం ప్రకృతికి ఒక కవితలాంటిది. బియాస్ నది తీరంలో నిలబడి చూస్తే నీటి శబ్దం మనసుకు సంగీతంలా వినిపిస్తుంది. సోలాంగ్ వ్యాలీ, హడింబా దేవి ఆలయం, రోహ్తాంగ్ పాస్ వంటి ప్రదేశాలు మనాలిని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. హైదరాబాద్ లేదా విశాఖపట్నం నుంచి ఢిల్లీ వరకు విమానం లేదా రైలు ద్వారా వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మనాలి చేరుకోవచ్చు.

మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!
రామేశ్వరం:
సముద్రం అలలతో పాటు చరిత్ర కూడా వినాలనిపిస్తే తమిళనాడులోని రామేశ్వరం ఒక అపూర్వమైన యాత్ర. సముద్రం మధ్యలో పొడవుగా సాగిన పాంబన్ బ్రిడ్జ్ మీదుగా రైలు ప్రయాణం చేస్తుంటే అది ఒక కలల దృశ్యంలా అనిపిస్తుంది. రామనాథస్వామి ఆలయం తన భారీ గోపురాలతో, పొడవైన మండపాలతో ప్రతి భక్తుని ఆశ్చర్యపరుస్తుంది. సముద్ర తీరంలో ఉన్న ధనుష్కోటి అనే ప్రదేశం ప్రకృతి, చరిత్ర కలిసిన ఒక విచిత్రమైన ప్రశాంతతను అందిస్తుంది. హైదరాబాద్ లేదా విజయవాడ నుంచి మదురై వరకు రైలు లేదా విమానం ద్వారా వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు లేదా రైలు మార్గంలో రామేశ్వరం చేరుకోవచ్చు.

మున్నార్:
ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా గడపాలని అనుకునే వారికి కేరళలోని మున్నార్ ఒక స్వర్గంలా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా పచ్చగా విరిసిన టీ తోటలు, కొండల మీద తేలియాడే మబ్బులు, ఉదయాన్నే గాలిలో తేలే చల్లదనం అన్నీ కలిసి ఒక చిత్రంలా కనిపిస్తాయి. ఎరావికులం నేషనల్ పార్క్, మట్టుపెట్టి డ్యామ్, టీ-మ్యూజియం లాంటి ప్రదేశాలు మున్నార్ అందాన్ని మరింత పెంచుతాయి. హైదరాబాద్ లేదా విశాఖపట్నం నుంచి కొచ్చి వరకు విమానం లేదా రైలు ద్వారా చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మున్నార్ చేరుకోవచ్చు.

మార్చిలోనే వేసవి తన అడుగులు వేస్తున్న ఈ రోజుల్లో, ఒక చిన్న ప్రయాణం మన జీవితానికి పెద్ద జ్ఞాపకంగా మారిపోవచ్చు. కుటుంబంతో కలిసి ఒక చిన్న బ్యాగ్ సర్దుకుని, ప్రకృతి పిలుపు వినిపిస్తున్న ఆ దిశగా అడుగులు వేస్తే ప్రతి ప్రయాణం ఒక కొత్త కథగా మారుతుంది.