July 9, 2026

Mension House Mallesh Review: మెన్షన్ హౌస్ మల్లేష్ రివ్యూ

Mension House Mallesh Review: మెన్షన్ హౌస్ మల్లేష్ రివ్యూ
Reading Time: 2 minutes
Mension House Mallesh Movie Review

శ్రీనాథ్ మాగంటి, గాయత్రీ రమణ జంటగా నటించిన ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైటిల్ మరియు ట్రైలర్‌తో వినూత్నమైన అడల్ట్ కామెడీ సినిమా అనే అంచనాలను క్రియేట్ చేసిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు మెప్పించిందో ఈ సమీక్షలో చూద్దాం.

కథ
చిన్నతనంలో తండ్రి వేధింపులు భరించలేక ఇంటి నుండి పారిపోయిన మల్లేష్ (శ్రీనాథ్ మాగంటి), తిరిగి వచ్చాక తన తండ్రి లాగే తాగుడికి బానిసవుతాడు. తనకున్న టెంట్ హౌస్ వ్యాపారంతో కాలం వెళ్లదీస్తుంటాడు. ఈ క్రమంలో తన మేనమామ కొడుకు చిన్న పటేల్ (రాజేష్‌)తో ఆస్తి గొడవలు, పాత పగలు కొనసాగుతుంటాయి. మల్లేష్ పద్ధతి మారుతుందనే ఆశతో అతని తల్లి తాగుడు అలవాటు లేదని అబద్ధం చెప్పి జ్యోతి (గాయత్రీ రమణ)తో పెళ్లి జరిపిస్తుంది. అయితే, పెళ్లయిన మొదటి రోజే మల్లేష్‌కు ఒక సున్నితమైన శారీరక సమస్య ఉందని తెలుస్తుంది. భార్య జ్యోతి అతన్ని అర్థం చేసుకున్నప్పటికీ, చిన్న పటేల్ ఈ విషయాన్ని ఊరందరి ముందు బయటపెట్టి మల్లేష్ పరువు తీస్తాడు. ఈ అవమానంతో రగిలిపోయిన మల్లేష్, చిన్న పటేల్‌తో ఒక వింతైన పందెం కడతాడు. ఆ పందెం ఏంటి? మల్లేష్ తన సమస్యను అధిగమించాడా? భార్యతో అతని సంసారం సజావుగా సాగిందా? అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ: ఫస్టాఫ్‌లో వచ్చే అడల్ట్ కామెడీ మరియు పెళ్లి తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు యువతను ఆకట్టుకుంటాయి. రాజ్‌కుమార్ కసిరెడ్డి తన మార్క్ కామెడీతో అక్కడక్కడా నవ్విస్తాడు. భార్యాభర్తల మధ్య ఉండే అండర్స్టాండింగ్ మరియు భావోద్వేగాలను దర్శకుడు బాల సతీష్ బాగానే డీల్ చేశారు. మొదటి భాగం వేగంగా సాగినా, రెండో భాగంలో కథనం నెమ్మదించింది. అవసరం లేని ఫ్లాష్‌బ్యాక్ సీన్లు సినిమా వేగాన్ని తగ్గించాయి. తండ్రి ఫ్లాష్‌బ్యాక్ ట్రాక్ కథకు పెద్దగా ఉపయోగపడదు. అలాగే కొన్ని సన్నివేశాలు అసభ్యకరంగా అనిపిస్తాయి. అలానే దర్శకుడు కేవలం ఒక చిన్న పాయింట్‌ను నమ్ముకుని సినిమామొత్తాన్ని లాగాలని ప్రయత్నించడం వల్ల కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా నాటు వైద్యం వైపు వెళ్లడం వంటివి కేవలం కామెడీ కోసమే అన్నట్లు ఉంటాయి.

నటీనటుల ప్రతిభ విషయానికి వస్తే సాఫ్ట్ రోల్స్ చేసే శ్రీనాథ్ మాగంటి ఈ సినిమాలో ఊర మాస్, తాగుబోతు పాత్రలో ఒదిగిపోయాడు. తెలంగాణ యాసలో పలికించిన డైలాగులు బాగున్నాయి. ఇక హీరోయిన్ గాయత్రీ రమణ తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. సాయి కామాక్షి భాస్కర్ల స్క్రీన్ టైమ్ తక్కువే అయినా ఉన్నంతలో ఇంపాక్ట్ చూపించింది. నిర్మాత రాజేష్ నటన గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే గనుక సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా బంధించింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉండాల్సింది, ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సీన్లు కట్ చేయొచ్చు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్లీ ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ ఒక విభిన్నమైన పాయింట్‌తో వచ్చిన అడల్ట్ కామెడీ డ్రామా. యూత్, మాస్ ప్రేక్షకులను మెప్పించవచ్చు.