Reading Time: 2 minutes
War Effect In Tirupati Commercial Gas Cylinder Supply Stop

అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిణామాలు ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిపై ఊహించని రీతిలో ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం భవిష్యత్తులో గృహ వినియోగదారులకు ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతో, నగరంలోని ప్రధాన గ్యాస్ కంపెనీలు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. రేపటి నుండి తిరుపతి నగరవ్యాప్తంగా 19.5 కేజీల కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వ , ప్రైవేటు గ్యాస్ కంపెనీలు సంయుక్తంగా నిశ్చయించుకున్నాయి. ఈ ఆకస్మిక నిర్ణయంతో అటు వ్యాపార వర్గాల్లోనూ, ఇటు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లోనూ ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత రాకుండా చూడటం కోసం కమర్షియల్ కోటాను నియంత్రించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

Jasprit Bumrah: ‘యార్కర్ కింగ్’ బుమ్రా సక్సెస్ వెనుక ఉన్న గురువు ఇతనే!

తిరుపతి నగరం ప్రధానంగా పర్యాటక , ఆధ్యాత్మిక రంగంపై ఆధారపడి ఉంటుంది. నగరంలో చిన్నపాటి తోపుడు బండ్ల నుండి మొదలుకొని ప్రతిష్ఠాత్మకమైన ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు సుమారు 3,000కు పైగా ఆహార విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఈ హోటళ్లన్నీ కలిపి నెలకు సుమారు 40,000కు పైగా కమర్షియల్ సిలిండర్లను వినియోగిస్తుంటాయి. ఇప్పుడు ఒకేసారి సరఫరా నిలిచిపోవడంతో, నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు భోజన వసతులు కల్పించడం హోటల్ యజమానులకు పెద్ద సవాలుగా మారింది. 15కు పైగా ఉన్న గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ పరిమితంగా ఉండటంతో, హోటల్ నిర్వహణ అస్తవ్యస్తమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీనివల్ల సామాన్య భక్తులకు అందుబాటు ధరలో దొరికే ఆహార పదార్థాల కొరత ఏర్పడటమే కాకుండా, ఉన్న వాటి ధరలు కూడా ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.

ఈ వార్త దావానంలా వ్యాపించడంతో తిరుపతి నగరంలో గ్యాస్ బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగాయి. రేపటి నుండి సరఫరా ఉండదన్న భయంతో హోటల్ యజమానులు, క్యాటరింగ్ నిర్వాహకులు తెల్లవారుజాము నుండే గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. తమ వద్ద ఉన్న ఖాళీ సిలిండర్లను నింపుకోవడానికి, ఉన్న స్టాక్‌ను దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, ప్రైవేటు గ్యాస్ కంపెనీలు కూడా ప్రభుత్వ సంస్థల బాటలోనే పయనిస్తుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మూసుకుపోయాయి. యుద్ధ ప్రభావం ఇక్కడితోనే ఆగుతుందా లేక మున్ముందు సామాన్యుల వంటగదిపై కూడా భారంగా మారుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని గమనిస్తున్న స్థానికులు , భక్తులు, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.

Faf du Plessis: “అతడో మాయశక్తి.. ఆ బౌలర్ జట్టులో ఉండటం మీ అదృష్టం”.. డు ప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు..