Reading Time: < 1 minute
Sa Vs Nz Semi Final 2026 History Favors New Zealand Form Backs South Africa

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా–న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీ ఫైనల్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇందుకు కారణం.. ఒకవైపు ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో న్యూజిలాండ్ ఆధిపత్యం ఉండగా, మరోవైపు ప్రస్తుత టోర్నీలో అద్భుత ఫామ్‌లో దక్షిణాఫ్రికా ఉండడమే. దీంతో ఈ సమరం నిజంగానే ఐకానిక్‌గా మారనుంది.

2011 వన్డే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో కూడా సఫారీలను కివీస్ కట్టడి చేసి ఫైనల్ చేరింది. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో కూడా న్యూజిలాండ్ విజయం సాధించి నాకౌట్ మ్యాచ్‌లలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇలా కీలక దశల్లో సౌతాఫ్రికాపై కివీస్‌కు ఆధిక్యం ఉంది. అయితే ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2026లో దక్షిణాఫ్రికా జట్టు దుర్భేద్యంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టి ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తూ సెమీస్‌కు చేరుకుంది. కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకుని గెలిచే సామర్థ్యాన్ని సఫారీ జట్టు ప్రదర్శిస్తోంది. న్యూజిలాండ్ విషయానికి వస్తే.. నాకౌట్ మ్యాచ్‌లలో వారి అనుభవం, సమయోచిత వ్యూహాలు ఎప్పుడూ ప్రత్యేకం. ఒత్తిడిని జయించడమే కివీస్‌కు బలంగా నిలుస్తుంది. గత చరిత్ర వారికి ధైర్యాన్నిస్తే.. ప్రస్తుత ఫామ్ దక్షిణాఫ్రికాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది.

మొత్తానికి చరిత్ర న్యూజిలాండ్ వైపు ఉంటే.. ఫామ్ దక్షిణాఫ్రికా వైపు ఉంది. ఈడెన్ వేదికగా ఈ రెండు బలమైన జట్లు తలపడుతున్న ఈ పోరు అభిమానులకు అసలైన క్రికెట్ థ్రిల్ అందించనుంది. ఎవరు ఫైనల్ బెర్త్ సాధిస్తారో చూడాలి. టాస్ సాయంత్రం 6.30కు పడనుండగా.. మ్యాచ్ 7 గంటలకు మొదలవనుంది.