Reading Time: < 1 minute
Holi 2026 Eye Safety Tips What To Do If Colors Enter Your Eyes

Holi 2026 Eye Safety Tips: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు.. అంటే మనకున్న ఇంద్రియాల్లో కళ్లు ఎంతో ప్రాముఖ్యమైనవి.. అయితే, హోలీ సమయంలో కళ్లలో గులాల్‌, ఇతర రసాయనాలు కలిపిన కలర్స్‌ పడితే.. ఎన్నో ఇబ్బందులు తప్పవు.. అయితే, రంగుల పండుగ హోలీ సందర్భంగా కళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం… ఇప్పటి మార్కెట్లో లభించే కొన్ని సింథటిక్ రంగుల్లో లెడ్ ఆక్సైడ్, మెర్క్యురీ సల్ఫైట్, పిండిచేసిన గాజు వంటి హానికర రసాయనాలు ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇవి కళ్లలోకి వెళ్తే చికాకు, కార్నియా గాయాలు లేదా తీవ్రమైన అలెర్జీ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

కళ్లలో రంగు పడితే వెంటనే ఏం చేయాలి..?
– ముందుగా జనసమూహం నుంచి దూరంగా వెళ్లాలి..
– కళ్లను రుద్దకండి – రుద్దడం వల్ల చిన్న కణాలు లోపలికి వెళ్లి కార్నియాను గాయపరచవచ్చు.
– శుభ్రమైన, పారే నీటితో కంటిని సున్నితంగా కడగండి.
– మినరల్ వాటర్ ఉంటే దానితో కూడా కంటిని శుభ్రం చేయవచ్చు.

కళ్లలో రంగు పడితే ఏమి చేయకూడదు?
– రోజ్ వాటర్ వేయకండి
– పాలు లేదా ఇంటి చిట్కాలు ప్రయత్నించకండి
– డాక్టర్ సలహా లేకుండా డ్రాప్స్ వాడకండి

వైద్యుల సూచన ప్రకారం, మొదట నీటితో కడగడం తప్ప మరే ద్రవం ఉపయోగించకపోవడం మంచిది. రోజ్ వాటర్ వంటి ద్రవాల్లో ఉండే ప్రిజర్వేటివ్‌లు పరిస్థితిని మరింత తీవ్రం చేయవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి
– చూపు మసకబారడం
– కడిగినా తగ్గని తీవ్రమైన నొప్పి
– కంటిలో ఏదో చిక్కుకున్నట్టు అనిపించడం
– కనురెప్పల వాపు
– కన్ను పూర్తిగా తెరవలేకపోవడం

ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి..
– కళ్ల చుట్టూ కొబ్బరి నూనె లేదా కోల్డ్ క్రీమ్ పూయండి
– సన్ గ్లాసెస్ లేదా రక్షణ కళ్లజోడు ధరించండి
– పెద్ద గుంపుల్లో జాగ్రత్తగా ఉండండి
– సాధ్యమైనంత వరకు సేంద్రీయ (ఆర్గానిక్) రంగులు ఉపయోగించండి
– సురక్షితమైన రంగులతో ఆనందంగా హోలీ జరుపుకోవడం ఉత్తమ మార్గం.