Reading Time: 2 minutes
New Income Tax Forms 2026 Pan Rules Hra Changes

ఆదాయపు పన్ను చట్టంలో సుమారు ఆరు దశాబ్దాల తర్వాత వస్తున్న అతిపెద్ద మార్పులు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, సరళంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం పన్ను మినహాయింపులు, నిబంధనలు , ఫారమ్‌ల సంఖ్యలో భారీ మార్పులు జరిగాయి.

ముఖ్యంగా, చాలా కాలంగా ఎదురుచూస్తున్న ‘మెట్రో నగరాల’ జాబితాలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు కేవలం నాలుగు నగరాలకే పరిమితమైన ఈ జాబితాలో ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, పూణే , అహ్మదాబాద్ నగరాలను కూడా చేర్చారు. దీనివల్ల ఈ నగరాల్లో నివసించే వేతన జీవులకు హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) విషయంలో మరింత పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉంది. అయితే, ఈ పన్ను ఆదా ప్రక్రియలో ఇకపై పారదర్శకత తప్పనిసరి. HRA క్లెయిమ్ చేసేటప్పుడు యజమానితో మీకు ఉన్న సంబంధాన్ని స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది, తద్వారా దగ్గరి బంధువులకు అద్దె చెల్లిస్తున్నట్లు చూపించి పన్ను ఆదా చేసే విధానాలపై ప్రభుత్వం నిఘా పెంచనుంది.

Iran-US-Israel War: ఇరాన్ యుద్ధం షాక్.. ఈ వస్తువుల ధరలు ఆకాశానికి!

ఇక పాన్ కార్డ్ (PAN) వాడకం విషయంలోనూ కఠినతరమైన, స్పష్టమైన నిబంధనలను ప్రభుత్వం తీసుకువచ్చింది. రూ. 5 లక్షలకు పైబడిన వాహనాల కొనుగోలుకు, రూ. 20 లక్షలు దాటిన స్థిరాస్తి లావాదేవీలకు, ఏడాదిలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రా చేసినా పాన్ ఇవ్వడం తప్పనిసరి. అలాగే హోటల్ బిల్లులు రూ. లక్ష దాటినా పాన్ వివరాలు సమర్పించాలి. వీటన్నింటితో పాటు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పిల్లల విద్యా , హాస్టల్ అలవెన్సులను గణనీయంగా పెంచారు. విద్యా అలవెన్స్ నెలకు రూ. 3,000కి, హాస్టల్ అలవెన్స్ రూ. 9,000కి పెరగడం మధ్యతరగతి ఉద్యోగులకు ఉపశమనం కలిగించే అంశం. యజమాని నుండి లభించే గిఫ్ట్స్, మీల్ వోచర్లు , మెడికల్ లోన్లపై కూడా పన్ను మినహాయింపు పరిమితులను సవరించారు.

పరిపాలనా పరంగా చూస్తే, గందరగోళానికి గురిచేసే 511 నిబంధనలను 333కి , 399 ఫారమ్‌లను 190కి తగ్గించడం వల్ల సామాన్య పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు తగ్గుతాయి. ఇకపై మనం చూసే ఫారమ్ నంబర్లలో కూడా మార్పులు ఉంటాయి. ఉదాహరణకు, గతంలో వాడే ఫారమ్ 16 ఇకపై ఫారమ్ 130గా, పాన్ అప్లికేషన్ ఫారమ్ 49A ఇకపై ఫారమ్ 94గా మారనుంది. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం, పారదర్శకత , డిజిటల్ విధానమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలు రూపొందించబడ్డాయి.

Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!