
అమరావతి: బ్రిటీష్ పాలనలో కూడా తిరుమల వెంకటేశ్వరస్వామి జోలికి రాలేదని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ కులదైవం వెంకటేశ్వర స్వామి అని.. తనను కాపాడింది ఆ దేవదేవుడే అని..అన్నారు. ఎపి అసెంబ్లీలోతిరుమల లడ్డూలో కల్తీనెయ్యిపై చర్చ జరిగింది. అసెంబ్లీలో సిఎం ప్రసంగించారు. సుప్రీంకోర్టు సిట్ వేసిందని సిట్ ఛార్జిషీట్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసిదని, రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధన తొలగించారని విమర్శించారు. 2020 ఫిబ్రవరిలో టెండర్ నిబంధనలు మార్చారని, అంగీకరించక పోవడంతో తనిఖీలకు ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు నీరుగార్చారని, ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారని మండిపడ్దారు. కావాలని పద్ధతి ప్రకారం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర చేశారని ధ్వజమెత్తారు. ఇందులో కుట్రకోణం ఉందని, సిండికేట్ గా తయారయ్యారని, 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందని, దేవుడి కోసం తక్కువ ధరకే ఇస్తున్నారంటే ఆలోచించుకోవాలని అన్నారు.
2019-24 మధ్యలో 20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాయని, ఎన్ డిడిబి రిపోర్టు రాగానే తాను ప్రకటన చేశానని, ఎన్ డిడిబి రిపోర్ట్ 2024 జులై 23న వచ్చిందని అన్నారు. కల్తీ నెయ్యి అని వచ్చినా రిపోర్ట్ ను తొక్కిపెట్టారని, సిట్ వేసేందుకు సిద్ధపడగా సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి గానీ, కుట్రపూరిత ఆలోచన దీని వెనుక ఉంటుందని, కెమికల్స్ తో నెయ్యి తయారీ చేసి ఇంకా బుకాయిస్తున్నారని అన్నారు. ఈ పోరాటంలో భాగంగా కాలినడకన తిరుమల వస్తానని మొక్కుకున్నానని, తిరుమల తిరుపతి వెళ్లే ఆర్టిసి బస్సుల టికెట్ లో అన్యమత ప్రచారం చేశారని, అందుకే ఇది కుట్ర అని తాను అంటున్నానని చెప్పారు. ఆ జివోకు వ్యతిరేకంగా అసెంబ్లీలో పోరాటం చేశానని, తాను సిద్ధాంతపరంగా పోరాడానని అన్నారు.
దేవాలయాల గురించి చాలా చులకనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసింది వాళ్లే భయపడి వెనక్కి తగ్గింది వాళ్లే, మళ్లీ దుష్ప్రచారం చేస్తుంది కూడా వాళ్లేనని సిఎం పేర్కొన్నారు. 2018 లో పింక్ డైమండ్ చోరీ జరిగిందని దుష్ప్రచారం చేశారని, మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి ఏం జరగలేదని అన్నారని, తిరిగి మనల్నే క్షమాపణ చెప్పమంటున్నారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఏడుకొండలు కాదు రెండు కొండలంటూ ఉత్తర్వులిచ్చారని, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లాలని తాము పరువు నష్టం దావా వేశామని అన్నారు. టిటిడిని రాజకీయ పునరావాస కేంద్రంగా తయారు చేశారని, వైసిపి హయాంలో 85 మందితో జంబో బోర్డు వేశారని చెప్పారు. తాను కలలో కూడా ఏడుకొండలపై తప్పుగా మాట్లాడలేదని, కలియుగ దేవుడికి అపచారం చేయడం తగదని సూచించారు. ఇద్దరు టిటిడి ఛైర్మన్లు కల్తీ జరిగిందని ఒప్పుకున్నారని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.