
వరంగల్: బిఆర్ఎస్ దెబ్బకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోయి వచ్చిందని బిఆర్ఎస్ నేత , మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మొన్న మేము దేవాదుల ప్రాజెక్టును సందర్శించినప్పుడు, సమ్మక్క బ్యారేజీలోని 10 మోటార్లలో కేవలం 6 మాత్రమే నడుస్తున్నాయని, రోజుకు 2700 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట 1700 క్యూసెక్కులు కూడా ఎత్తడం లేదని ఎత్తిచూపామన్నారు. వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, ఇతర బిఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఏ విధంగా దెబ్బతింటుందో ప్రజల ముందు ఉంచామని, ఆ దెబ్బకు తెల్లారి ముఖ్యమంత్రి హడావిడిగా రివ్యూ చేసి అన్ని మోటార్లు నడపాలని ఆదేశించారని, ఇది బీఆర్ఎస్ విజయమే కాదు, రైతుల విజయమని ప్రశంసించారు. డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప పనులు కావడం లేదని, మంత్రులు దేవాదుల ప్రాజెక్టు తమ ప్రాధాన్యత అని పదేపదే చెప్తున్నారు కానీ చేతల్లో మాత్రం అది వారికి చివరి ప్రాధాన్యతగా మారిందని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వంలో 7300 కోట్లు ఖర్చు పెట్టి 3 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందించామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు డెడ్ లైన్లు మార్చుకుంటూ కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2027 మార్చి డెడ్ లైన్ పెట్టారుని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమో 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మరో కొత్త డెడ్ లైన్ పెట్టారని ఎద్దేవా చేశారు. రోజుకో డేట్ మారుతోందే తప్ప ప్రాజెక్టులో అంగుళం పని కూడా ముందుకు సాగడం లేదని విమర్శలు గుప్పించారు.
భూసేకరణకు నిధులు విడుదల చేయడం చేతకాని రేవంత్ రెడ్డి, ఉన్న మోటార్లను నడపలేక రైతుల పంటలు ఎండిపోయేలా చేస్తున్నారని, రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం గోదావరిపై అనేక బ్యారేజీలు నిర్మించి, 312 కిలోమీటర్ల మేర గోదావరిని నిండుకుండలా సజీవంగా ఉంచిందని, 9 ఏళ్లలో మేం 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే, మీ రెండున్నరేళ్లలో కనీసం లక్ష ఎకరాలకైనా నీళ్లిచ్చారా? అని అడిగారు. ఇరిగేషన్ మీద అసెంబ్లీలో మాట్లాడతామని ముఖ్యమంత్రి అంటున్నారని, తాము మీ సవాల్‌ను స్వీకరిస్తున్నామని, మైక్ కట్ చేయకుండా, కెమెరా తిప్పకుండా చర్చకు పెట్టాలని, ఎన్ని రోజులైనా, ఏ ప్రాజెక్టు మీదైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ప్రజలే న్యాయ నిర్ణేతలు ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా తేల్చుకుందామని సవాల్ విసిరారు. దేవాదులను పక్కనపెట్టి ఆంధ్రాకు నీళ్లు ఎలా వదులుతున్నావో, నల్లమల సాగర్ కు ఎలా సహకరిస్తున్నావో తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ముందు ఆ 10 శాతం పనులు పూర్తి చేసి రైతుల పొలాలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ హయాంలోనే 24 అంతస్తుల స్లాబులు పూర్తయిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని చూస్తుంటే బాధేస్తోందని, 2024 దసరాకే ఇది ప్రారంభం కావాల్సిందని, కెసిఆర్ ఉండి ఉంటే ఈపాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చేదన్నారు.
కానీ కాంగ్రెస్ వచ్చాక పనులు అటకెక్కి, రెండు దసరాలు పోయి మూడో దసరా వస్తున్నా కదలడం లేదని, రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ కెసిఆర్ కట్టిన ఈ హెల్త్ సిటీ మీద లేదన్నారు. ఫ్యూచర్ సిటీకి పెట్టిన శ్రద్ధలో 10 శాతం పెట్టినా ఈ పనులు ఎప్పుడో పూర్తయ్యేవన్నారు. కెసిఆర్ గారికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ఈ నిర్లక్ష్యమని, ఈ హెల్త్ సిటీకి ఎన్ని నిధులు కావాలో బిఆర్ఎస్ ప్రభుత్వమే సమకూర్చి పెట్టిందన్నారు. కానీ మీరు డిజైన్ల మార్పు పేరుతో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోవడం లేదని చురకలంటించారు. జూన్ 2న ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్తున్నారు. 2000 పడకల ఈ ఆసుపత్రికి 2000 మంది నర్సులు, 1500 మంది డాక్టర్లు, 1000 మంది పారామెడికల్ సిబ్బంది కావాలన్నారు. ఇంతవరకు రిక్రూట్మెంట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందా? నోటిఫికేషన్ ఇచ్చారా? కనీసం సిబ్బంది లేకుండా హాస్పిటల్ ఎలా ప్రారంభిస్తారు? అని ప్రశ్నించారు. పేపర్లలో చూస్తే ‘ఓపీ సేవలు’ ప్రారంభిస్తాం అని రాశారు. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటలా? లేక బస్తీ దవాఖానానా? అని నిలదీశారు. ఓపీ చూడ్డానికి ఈ హాస్పిటల్ ఎందుకు? బిఆర్ఎస్ హయాంలో వరంగల్ గల్లీగల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టామని, దీన్ని కూడా మరో బస్తీ దవాఖానా చేయకండన్నారు. వెంటనే ఎక్విప్మెంట్, సిబ్బంది నియామకం పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఆసుపత్రిని ప్రారంభించాలని, లేదంటే బిఆర్ఎస్ పక్షాన ఇక్కడే నిరాహారదీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఉత్తర తెలంగాణకు సంజీవని లాంటి వరంగల్ లో ఆరోగ్య శాఖ పరిస్థితి దయనీయంగా మారిందని ధ్వజమెత్తారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఫ్రీ హెల్త్ స్కీమ్ తెచ్చిందని, ఉద్యోగులకు 1% కంట్రిబ్యూషన్ తో, జర్నలిస్టులకు పూర్తిగా ఉచితంగా సేవలు అందించాలని నిర్ణయించామని, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం జర్నలిస్టులను చూస్తేనే విసుక్కుంటోందన్నారు. కెసిఆర్ 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు బడ్జెట్లలో జర్నలిస్టుల కోసం ఒక్క రూపాయి అయినా కేటాయించిందా? అని నిలదీశారు. రెండున్నరేళ్లలో ఒక్కరికైనా కొత్త అక్రిడేషన్ కార్డ్ ఇచ్చారా? జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగా జర్నలిస్టుల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని లేదంటే ప్రమాదవశాత్తు జర్నలిస్టులు మరణిస్తే వాళ్ల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నిన్న వరంగల్‌లో కార్పొరేటర్లను, మొన్న బాల్క సుమన్‌ను, ఆమన్‌గల్లులో బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని, కక్షలు కట్టడం కాదని ముందు ఆసుపత్రి కట్టు అని రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. ఆసుపత్రి పూర్తయితే కొన్ని వేల మంది పేదలకు వైద్యం దొరుకుతుందని, కెసిఆర్ మీద పడి ఏడ్వడం మానేసి, 20 లక్షల స్క్వేర్ ఫీట్స్ తో కడుతున్న ఈ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని డిమాండ్ చేస్తున్నమన్నారు.
ఈ పర్యటనలో హరీష్ రావు వెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, రవీందర్ రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, సీనియర్ నాయకులు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవ రెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు