Reading Time: < 1 minute

వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Caption of Image.

సూర్యాపేట: వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి అన్నారు. గత 12 సంవత్సరాలుగా బీజేపీ ఓటు చోరీ చేసి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని దేశం ఎదురుచూస్తోందని మంత్రి అన్నారు.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో గరిడేపల్లి, పాలకీడు, నేరేడుచర్ల మండలాలకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 

తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. గతంలో నాణ్యత లేని దొడ్డు బియ్యం అందించేవారని, వాటిని ప్రజలు వినియోగించుకోకుండా అమ్ముకునే పరిస్థితి ఉండేదని ఆయన పేర్కొన్నారు.నిరుపేదల కోసం తమ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని మంత్రి అన్నారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తున్నామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డులు అందించే కార్యక్రమం తనకు అత్యంత సంతృప్తిని కలిగించే కార్యక్రమాల్లో ఒకటని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 6 లక్షల రేషన్ కార్డులు అందించామని, వాటి ద్వారా సుమారు 3 కోట్ల మంది ప్రజలు సన్నబియ్యం పొందుతున్నారని మంత్రి తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 3 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు అందించామని వెల్లడించారు.

 

©️ VIL Media Pvt Ltd.