Reading Time: < 1 minute

అప్పర్‌‌ భద్రపై సుప్రీం కీలక నిర్ణయం.. విచారణాంశాలు ఖరారు చేసిన సర్వోన్నత న్యాయస్థానం..

Caption of Image.
  • 8 వారాల్లో ఆధారాలు సమర్పించాలని ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: అప్పర్‌‌ భద్ర ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏపీ దాఖలు చేసిన ఒరిజినల్‌‌ సూట్‌‌పై సుప్రీంకోర్టు తదుపరి విచారణకు సంబంధించిన అంశాలను ఖరారు చేసింది. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌‌ అవార్డు పరిధిలో లేని అప్పర్‌‌ భద్ర ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైనే విచారణ కొనసాగనుంది. 

ప్రాజెక్టు నిర్మాణం, దాని ప్రభావం తదితర అంశాలపై ఏపీ దాఖలు చేసిన ఒరిజినల్‌‌ సూట్‌‌లో విచారణకు తీసుకోవాల్సిన అంశాలను నిర్ణయించాలని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు ఏపీ, కర్నాటక రాష్ట్రాలు తమ ప్రతిపాదిత విచారణాంశాలను కోర్టుకు సమర్పించాయి. 

7 అంశాలపై విచారణకు ప్రతిపాదన

సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా ఇరు రాష్ట్రాలు మొత్తం 7 అంశాలపై విచారణ చేపట్టాలని ప్రతిపాదించాయి. అప్పర్‌‌ భద్ర ప్రాజెక్టుకు సంబంధించి కృష్ణా ట్రైబ్యునల్‌‌ అవార్డు పరిధి, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చట్టపరమైన అంశాలు, రాష్ట్రాల హక్కులు, ప్రాజెక్టు వల్ల కలిగే ప్రభావాలకు సంబంధించిన అంశాలు విచారణ పరిధిలోకి రానున్నాయి. ఇరు రాష్ట్రాలు సమర్పించిన ముసాయిదా అంశాలను పరిశీలించిన ధర్మాసనం తదుపరి విచారణ ప్రక్రియకు వీటిని ఖరారు చేసింది.

8 వారాల్లో ఆధారాలు సమర్పించాలి

కేసులో వాద ప్రతివాదులుగా ఉన్న అన్ని పక్షాలు తమ వాదనలకు మద్దతుగా ఉన్న సాక్ష్యాలు, సంబంధిత డాక్యుమెంట్లను 8 వారాల్లో సుప్రీంకోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో అప్పర్‌‌ భద్ర ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరు రాష్ట్రాలు తమ వద్ద ఉన్న ఆధారాలను కోర్టు ముందుంచాల్సి ఉంటుంది. తదుపరి విచారణలో ఈ ఆధారాలు, పత్రాల ఆధారంగా కేసులోని అంశాలను సుప్రీంకోర్టు పరిశీలించనుంది. 

©️ VIL Media Pvt Ltd.