Reading Time: < 1 minute

100 మందికి మన్మోహన్ ఫెలోషిప్..ప్రకటించిన ఏఐపీసీ చైర్మన్ మధుయాష్మి గౌడ్

Caption of Image.
  • సెకండ్​ బ్యాచ్ ​సెలక్షన్ ​ప్రాసెస్ ​షురూ

న్యూఢిల్లీ, వెలుగు: మాజీ ప్రధాని డాక్టర్‌‌ మన్మోహన్‌‌ సింగ్‌‌ 94వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత ప్రొఫెషనల్స్‌‌ కాంగ్రెస్‌‌ (ఏఐపీసీ) మన్మోహన్‌‌ సింగ్‌‌ ఫెలోషిప్‌‌ రెండో బ్యాచ్‌‌ ఎంపిక ప్రక్రియకు శనివారం శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ‘ప్రొఫెషనల్‌‌ ఎక్స్‌‌లెన్స్‌‌ నుంచి పొలిటికల్‌‌ ఇంపాక్ట్‌‌’ థీమ్‌‌తో 100 మంది ప్రొఫెషనల్స్‌‌ను ఫెలోషిప్‌‌కు ఎంపిక చేయనున్నారు. ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఏఐపీసీ చైర్మన్‌‌ మధుయాష్కీ గౌడ్‌‌ రెండో బ్యాచ్‌‌ ఫెలోషిప్‌‌ కార్యక్రమాన్ని ప్రకటించారు.

మన్మోహన్‌‌ సింగ్‌‌ వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఫెలోషిప్‌‌ను ప్రారంభించినట్లు తెలిపారు. వివిధ వృత్తులు, సామాజిక వర్గాలకు చెందిన ప్రతిభావంతులను రాజకీయాలు, పాలసీ మేకింగ్‌‌, దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. లోక్‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌‌ గాంధీ సూచనల మేరకు ఫెలోషిప్‌‌ సంఖ్యను 50 నుంచి ఈ ఏడాది 100కు పెంచినట్లు వివరించారు. ఆసక్తి ఉన్నవారు ప్రత్యేక వెబ్‌‌సైట్‌‌ ద్వారా నెల రోజుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏఐపీసీ మాజీ చైర్మన్‌‌, రాజ్యసభ సభ్యుడు ప్రవీణ్‌‌ చక్రవర్తి, ఇతర నేతలు పాల్గొన్నారు. 

మూడో వంతు మహిళలే

ఫస్ట్​బ్యాచ్‌‌లో 16 రాష్ట్రాలకు చెందిన 50 మంది పాల్గొన్నారని, వారిలో మూడో వంతు మహిళలు ఉన్నారని మధుయాష్కీ వెల్లడించారు. బ్యాంకింగ్‌‌, పాఠశాల విద్య, ఐటీ, వైద్యం తదితర విభిన్న రంగాలకు చెందినవారు ఫెలోస్‌‌గా ఎంపికయ్యారని తెలిపారు. తొలి బ్యాచ్‌‌లో సుమారు 56% మంది ఓబీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందినవారున్నారని.. . రెండో బ్యాచ్‌‌లోనూ అత్యంత ప్రతిభావంతులైన ప్రొఫెషనల్స్‌‌కు అవకాశం కల్పిస్తామని తెలిపారు. సమ్మిళిత భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలనుకునే ప్రొఫెషనల్స్‌‌ ముందుకు రావాలని మధుయాష్కీ పిలుపునిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.